FIFA World Cup 2022: ఖతార్ కీలక నిర్ణయం.. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు విజిటర్లకు నో ఎంట్రీ!

ABN , First Publish Date - 2022-09-22T18:55:35+05:30 IST

ఫిఫా వరల్డ్ కప్-2022 (FIFA World Cup 2022)కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

FIFA World Cup 2022: ఖతార్ కీలక నిర్ణయం.. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు విజిటర్లకు నో ఎంట్రీ!

దోహా: ఫిఫా వరల్డ్ కప్-2022 (FIFA World Cup 2022)కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు సందర్శకుల ఎంట్రీని పూర్తిగా బ్యాన్ చేసింది. రోడ్డు, వాయువు, జల మూడు మార్గాల్లోనూ విజిటర్ల ఎంట్రీని నిషేధించినట్లు పేర్కొంది. తిరిగి డిసెంబర్ 23 నుంచి సందర్శకుల ప్రవేశాన్ని పునరుద్ధరించునున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఖతార్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior ministry) బుధవారం ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వరల్డ్ కప్‌ను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. 


ఇక వరల్డ్ కప్ కోసం జారీ చేసిన ఖతార్ హయ్యా కార్డు (Qatar Hayya Card) ఉన్నవారికి ఎంట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కార్డుదారులకు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 23 వరకు ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే 2023 జనవరి 23 వరకు దేశంలో ఉండొచ్చు. కాగా, ఎంట్రీ బ్యాన్ నిబంధన నుంచి కొన్ని కేటగిరీల వారికి మినహాయింపు ఉంది. వారిలో ఖతార్ పౌరులు మరియు నివాసితులు, ఖతార్ ఐడీ కార్డు కలిగిన జీసీసీ (GCC) దేశాల పౌరులకు ఎంట్రీకి ఎలాంటి అవరోధం ఉండదు. వీరితో పాటు ఎంప్లాయిమెంట్ వీసాలు (Employment visas), వర్క్ ఎంట్రీ పర్మిట్స్ (Work entry permits) ఉన్నవారికి కూడా ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అలాగే మానవీయకోణంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ ఎంట్రీకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనను తప్పకుండా అందరూ పాటించాలని మంత్రిత్వశాఖ అభ్యర్థించింది. ఇక దోహాలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫిఫా వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే.    


Updated Date - 2022-09-22T18:55:35+05:30 IST