భారతీయ దౌత్య ప్రతినిధికి Qatar సమన్లు.. మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలే కారణం

ABN , First Publish Date - 2022-06-06T02:13:46+05:30 IST

మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలపై ఇటు భారత్, అటు విదేశాల్లోనూ దుమారం రేగుతోంది. ఖతర్‌లోని భారతీయ దౌత్యాధికారికి అక్కడి ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.

భారతీయ దౌత్య ప్రతినిధికి Qatar సమన్లు.. మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలే కారణం

దోహా : మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలపై ఇటు భారత్, అటు విదేశాల్లోనూ దుమారం రేగుతోంది. ఖతర్‌లోని భారతీయ దౌత్యాధికారికి అక్కడి ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.  నుపుర్ శర్మ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను నవీన్ కుమార్ జిందాల్ ట్వీట్ చేయడంపై ఖతర్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీరి అనుచిత వ్యాఖ్యలపై అరబ్ దేశాల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ వస్తువులు, సినిమాలను బాయ్‌కాట్ చేయాలనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో ఖతర్ ప్రభుత్వం ఈ సమన్లు జారీ చేసింది. కాగా నుపుర్ శర్మ, ఆమె సహచరుడు నవీన్ కుమార్ జిందాల్‌పై  బీజేపీ నాయకత్వం కఠిన చర్యలు తీసుకున్నా పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించడం లేదు. భారతీయ ముస్లింలతోపాటు విదేశాల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది.


ఆ వ్యాఖ్యలతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు..

నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదని ఖతర్‌లోని భారత అంబాసిడర్ దీపక్ మిట్టల్ తెలిపారు. ఖతర్ అభ్యంతరంపై భారత దౌత్యకార్యాలయంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. భేటీ అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ నుపుర్ వ్యాఖ్యలు, నవీన్ జిందాల్ ట్వీట్లు భారత ప్రభుత్వ ఆలోచనలకు ప్రతిబింబంగా భావించొద్దు. వ్యక్తిగత భావాలుగా మాత్రమే పరిగణించాలి’’ అని ప్రకటనలో స్పష్టం చేశారు. వేర్వేరు ఆచారాలు, గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగివున్న భారత ప్రభుత్వం అన్ని మాతాలకూ సగౌరవం ఇస్తుంది. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఇప్పటికే గట్టి చర్యలు తీసుకుందని ప్రకటనలో పేర్కొంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న భారత్ గొప్ప దేశంగా అవతరించాలనుకుంటుంది. అందరికీ గౌరవం ఇస్తుందని భారతీయ దౌత్యకార్యాలయం వెల్లడించింది. కాగా గతవారం ఓ టీవీ డిబేట్‌లో నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ నవీన్ కుమార్ జిందాల్ ట్వీట్లు చేయడం ఆగ్నికి ఆజ్యం పోసింది. ముస్లిం వర్గాల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

Updated Date - 2022-06-06T02:13:46+05:30 IST