Qantas Airline: సీనియర్ ఉద్యోగులను బ్యాగేజీ హ్యాండిలర్స్‌గా మార్చేసిన క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌‌.. అదేంటని అడిగితే..

ABN , First Publish Date - 2022-08-09T19:15:58+05:30 IST

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హట్‌టాపిక్ అవుతోంది.

Qantas Airline: సీనియర్ ఉద్యోగులను బ్యాగేజీ హ్యాండిలర్స్‌గా మార్చేసిన క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌‌.. అదేంటని అడిగితే..

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హట్‌టాపిక్ అవుతోంది. సంస్థలోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లను బ్యాగేజీ హ్యాండిలర్స్‌గా మార్చేసింది. అది కూడా మూడు నెలల పాటు బ్యాగేజీ హ్యాండిలర్స్‌గా పనిచేయాలని ఆదేశించింది. అంటే.. మూడు నెలల పాటు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు బ్యాగుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌తో పాటు లగేజీని తరలించే వాహనాలను కూడా నడపాల్సి ఉంటుంది. అయితే, ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం తీవ్రమైన సిబ్బంది కొరతగా తెలిసింది. సిడ్నీ, మెల్బోర్న్‌ విమానాశ్రయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందట. దాంతో 100 మంది సహాయకుల కోసం సంస్థ ఆపరేషన్స్‌ హెడ్‌ ప్రయత్నిస్తున్నారు. ఇక ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ ప్రయాణాలను సరళతరం చేయడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో పెరిగిన రద్దీని తట్టుకొనేందుకు అవసరమైన సిబ్బంది లేక ఈ ఎయిర్‌లైన్ సంస్థ ఇలా పడరానిపాట్లు పడుతోంది. 


క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కొలిన్‌ హూగెస్‌ మాట్లాడుతూ.. "ఓ పక్క వింటర్‌ ఫ్లూ, కరోనా కేసులు పెరిగాయి. దీనికి తోడు మార్కెట్‌లో కార్మికుల కొరత అనేది తీవ్రతరమైంది. ప్రస్తుతం వనరుల కొరత ఓ సవాలుగా మారింది" అని అన్నారు. ఈ నేపథ్యంలోనే తప్పనిపరిస్థితుల దృష్ట్యా సంస్థలోని సీనియర్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లను ఇలా బ్యాగేజీ హ్యాండ్లింగ్ విభాగంలో వారంలో మూడు లేదా ఐదు రోజులపాటు పనిచేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రోజుకు నాలుగు గంటలు పనిచేయాలా? లేదా ఆరు గంటలు పనిచేయాలా? అనే విషయాన్ని ఉద్యోగులే నిర్ణయించుకోవాలన్నారు. గతంలో కూడా క్వాంటాస్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌లతో ఇదే విధంగా పనిచేయించిన విషయాన్ని కొలిన్ హూగెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Updated Date - 2022-08-09T19:15:58+05:30 IST