Abn logo
Jan 27 2021 @ 00:43AM

క్యూ-హ‌బ్ సీఈవో దాతృత్వం.. అంధుల‌కు ఆప‌న్న హ‌స్తం!

ఇబ్రహీంపట్నం: `ప‌రోప‌కారార్థమిదం శ‌రీరం!` అన్న వాక్కుల‌ను నిజం చేశారు క్యూ-హ‌బ్‌ సంస్థ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి(సీఈవో) ప్రియాంక వ‌ల్లేప‌ల్లి, శ‌శికాంత్ వ‌ల్లేప‌ల్లి. సొంత లాభం కొంత మానుకుని.. పొరుగు వాడికి తోడు ప‌డేందుకు ముందుకు వ‌చ్చారు. అది కూడా స‌ర్వేంద్రియాల్లో ప్ర‌ధాన‌మైన నేత్రాలు లేని అంధుల‌కు ఆప‌న్న హ‌స్తం అందించారు. భార‌త 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఏదైనా సామాజిక సేవా కార్య‌క్ర‌మం చేయాల‌ని శశికాంత్, ప్రియాంక త‌ల‌పోశారు. ఈ క్ర‌మంలో నిజ‌మైన అవ‌స‌రం ఎవ‌రికి ఉంది? అనే విష‌యంపై దృష్టి పెట్టి పాత్ర‌ నెరిగి సాయం చేయాల‌నుకున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లాలో ఇబ్ర‌హీంప‌ట్నంలో ఉన్న `స్ఫూర్తి జ్యోతి ఫౌండేష‌న్‌`ను ఎంచుకున్నారు. ఈ సంస్థ కొన్నేళ్లుగా అంధ‌త్వంతో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌లు, యువ‌తీ యువ‌కుల‌‌కు ప‌లు రంగాల్లో శిక్ష‌ణ ఇస్తోంది. 'నా క‌నులు నీవిగా చేసుకుని చూడు' అన్న‌ట్టు, అంధుల‌కు అన్నీ తానై ఈ సంస్థ మార్గ‌ద‌ర్శ‌నం చేస్తోంది. ఇక్క‌డ ఎంతో మంది అంధులు శిక్ష‌ణ పొందుతూ అభ్యున్న‌తి దిశ‌గా దూసుకువెళ్తున్నారు. సాధార‌ణ యువ‌త‌కు తామేమీ తీసిపోమ‌నే రీతిలో శిక్ష‌ణ పొందుతున్నారు. ఇలాంటి సంస్థ‌కు చేసే సాయం ఇక్క‌డ ఆశ్ర‌యం పొందుతున్న అంధుల‌కు అందించే ఆప‌న్న హ‌స్తం నిజ‌మైన సామాజిక సేవ‌గా భావించారు శశికాంత్, ప్రియాంక. 


దేశంలో అంద‌రూ స‌మానులేన‌ని, ప్ర‌తి పౌరుడికి స‌మాన హ‌క్కులు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసిన భార‌త‌ రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు వారిరువురు `స్ఫూర్తి జ్యోతి ఫౌండేష‌న్‌` ను సంద‌ర్శించారు. ఈ సంస్థ‌లోని మొత్తం 39 మంది అంధ‌ విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌ర స‌రుకులను అందించారు. అంతేకాదు విద్యార్థుల‌కు ఎంతో కీల‌క‌మైన బ్రెయిలీ పుస్త‌కాలను కూడా బ‌హూక‌రించారు. కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా సంస్థకు అందించారు. ఈ సంద‌ర్భంగా ప్రియాంక వ‌ల్లేప‌ల్లి మాట్లాడుతూ.. అంధుల అభ్యున్న‌తి కోసం వారి జీవితాల్లో వెలుగులు ప్ర‌స‌రింప‌చేయ‌డం కోసం స్ఫూర్తి జ్యోతి ఫౌండేష‌న్, గంగా ప్ర‌సాద్ పొట్లూరి చేస్తున్న అవిర‌ళ కృషిని కొనియాడారు.

Advertisement
Advertisement
Advertisement