కొత్త కొలువులోకి జంప్‌

ABN , First Publish Date - 2022-08-19T05:57:36+05:30 IST

దేశంలో 30 శాతానికి పైగా ఉద్యోగులు కొత్త కొలువులోకి మారాలనే ఆలోచనలో ఉన్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. అలాగే, 71 శాతం మంది సిబ్బంది..

కొత్త కొలువులోకి జంప్‌

34% మంది ఉద్యోగుల అభిమతమిదే: పీడబ్ల్యూసీ 


న్యూఢిల్లీ: దేశంలో 30 శాతానికి పైగా ఉద్యోగులు కొత్త కొలువులోకి మారాలనే ఆలోచనలో ఉన్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా సర్వే వెల్లడించింది. అలాగే, 71 శాతం మంది సిబ్బంది ప్రమోషన్ల విషయంలో యాజమాన్యం తమను పట్టించుకోలేదన్న భావనలో ఉన్నారని తెలిపింది.  గడిచిన కొన్నేళ్లలో భారత కార్యాలయాల్లో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని.. ఉద్యోగులతో పాటు యాజమాన్య దృక్పథంలోనూ మార్పు వచ్చిందని సర్వే నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది.


కంపెనీల యాజమాన్యాలేమో చురుకైన సిబ్బందిని సమకూర్చుకోవడంపై దృష్టి సారిస్తుండగా.. ఉద్యోగులను మాత్రం ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు లక్ష్య సాధన, సృజనాత్మకత, ఆవిష్కరణలు, ప్రామాణికత వంటి అంశాలు ప్రేరేపిస్తున్నాయని తెలిపింది. భారత్‌లో 2,608 మంది ఉద్యోగులను సర్వే చేసినట్లు, అందులో 93 శాతం మంది ఫుల్‌ టైం ఉద్యోగులని సంస్థ వెల్లడించింది. రిపోర్టులోని మరిన్ని విషయాలు.. 


  •  భారత్‌లో 34 శాతం మంది ఉద్యోగులు కొత్త కొలువులోకి మారే ఆలోచనలో ఉన్నారు. ప్రపంచ సర్వేలో ఈ వాటా 19 శాతంగా నమోదైంది. 
  • సర్వేలో పాల్గొన్న 32 శాతం మంది ఉద్యోగం మొత్తానికే వదిలేయాలనుకుంటున్నారు. 
  • భారత మిలీనియల్‌ (25-40 ఏళ్ల) సిబ్బందిలో 37 శాతం మంది వచ్చే 12 నెలల్లో కొత్త ఉద్యోగంలోకి మారే ఆలోచనలో ఉన్నారు. 
  • జెనరేషన్‌ జెడ్‌ (25 ఏళ్లలోపు) సిబ్బందిలో ఉద్యోగం మారే ఆలోచన కలిగిన వారు తక్కువే. కానీ, మూడో వంతు మంది మాత్రం పని గంట లు తగ్గించమని కోరాలనుకుంటున్నారు. 
  • నైపుణ్య కొరత అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. 54 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయమిదే. తాము చేసే ఉద్యోగానికి ప్రత్యేక శిక్షణ అవసరమని 67 శాతం మంది భావిస్తున్నారు. 
  • కంపెనీలు వేతన పెంపు, కొత్త నియామకాలు, యాంత్రీకరణను నైపుణ్య కొరతకు పరిష్కారంగా చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రమే ఉద్యోగు ల నైపుణ్యం పెంపు శిక్షణపై దృష్టి సారిస్తున్నాయి. 
  • సర్వే ప్రకారం.. దేశంలో హైబ్రిడ్‌ పని విధానం భవిష్యత్‌లోనూ కొనసాగనుంది. తమ పనిని ఎక్కడి నుంచైనా పూర్తి చేయవచ్చని 81 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నారు. కాగా 31 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే హైబ్రిడ్‌ విధానంలో పనిచేస్తున్నారు. 

Updated Date - 2022-08-19T05:57:36+05:30 IST