డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న పీవీ సింధు

ABN , First Publish Date - 2020-09-18T22:24:24+05:30 IST

అక్టోబరు 13 నుంచి 18 వరకు ఓడెన్స్‌లో జరగనున్న డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు నుంచి ఒలింపిక్ రజత పతక

డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న పీవీ సింధు

హైదరాబాద్: అక్టోబరు 13 నుంచి 18 వరకు ఓడెన్స్‌లో జరగనున్న డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు నుంచి ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు తప్పుకున్నట్టు తెలుస్తోంది. ‘‘డెన్మార్ ఓపెన్‌లో సింధు ఆడడం లేదు’’ అని గోపీచంద్ అకాడమీ వర్గాలు తెలిపాయి.


అయితే, ఎందుకు తప్పుకుందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్ నుంచి కూడా సింధు తప్పుకోగా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) అధ్యక్షుడు హిమాంత బిశ్వశర్మ అభ్యర్థనపై తిరిగి ఆడేందుకు అంగీకరించింది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది.


డెన్మార్క్ ఓపెన్ కోసం ఎంట్రీలు పంపిన ఆటగాళ్లకు బాయ్ మంగళవారం లేఖలు రాసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో టోర్నీలో పాల్గొనాలనుకునే వారు తమకు తామే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. తమ అంగీకారాన్ని ఈ నెల 17లోగా చెప్పాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో సింధు ఈ టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. అలాగే, నవంబరులో జరగనున్న ఆసియా ఓపెన్-1, ఆసియా ఓపెన్-IIలలో పాల్గొనాలని భావిస్తోంది. 


కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, శుభంకర్ డే తదితరులు సూపర్ 750 ఈవెంట్‌లో పాల్గొనేందుకు తమ అంగీకారం తెలిపారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు కూడా తమ అంగీకార లేఖలు పంపినప్పటికీ టోర్నమెంట్ సమయానికి ముందు నిర్ణయం తీసుకోనున్నారు.  


Updated Date - 2020-09-18T22:24:24+05:30 IST