Abn logo
Aug 3 2021 @ 03:49AM

సెమీస్‌లో ఓడాక ఏడ్చేశా..

బలీయమైన క్రీడాకారిణితో ఒలింపిక్స్‌ సెమీఫైనల్లో తలపడిన సింధు ఓటమి పాలైంది. అయితే ఆ తర్వాత పుంజుకొని అఖండ భారతావనిని కాంస్య పతకంతో మురిపించిన సింధు విజయం వెనుక దాగున్న కఠోర శ్రమ ఎంత మందికి తెలుసు? గోపీచంద్‌ అకాడమీని వీడిన తర్వాత సింధు ప్రాక్టీస్‌ ఎలా  సాగింది? వరుసగా రెండోసారి భారత్‌కు ఒలింపిక్‌ పతకం అందించిన బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పీవీ సింధు టోక్యో పతకానికి మరో వైపున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)


వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమనేది నా జీవితంలోనే ఒక అపూర్వ ఘట్టం. ఆనందంగా ఉంది. కాంస్య పోరులో గెలవగానే ఐదారు సెకన్లపాటు నా చుట్టూ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కోచ్‌ పార్క్‌ను ఆలింగనం చేసుకొని థ్యాంక్యూ చెప్పాక తేరుకొని ‘నేను సాధించా’ అని కోర్టులో గట్టిగా అరిచేశా. ఉద్వేగానికి లోనయ్యా. ఒకే సమయంలో భిన్న అనుభూతులు కలిగాయి. వాటిని మాటల్లో చెప్పలేను.


ఆ మాటలు మనసును తాకాయి..

సెమీఫైనల్స్‌లో తైజు యింగ్‌తో ఓడిపోయాక ఏడుపొచ్చేసింది. ఆ సమయంలో పార్క్‌ నాకు ధైర్యం చెప్పాడు. ఇక్కడితో కథ ముగిసిపోలేదని.. తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెడదామని సముదాయించాడు. కాంస్య పతకం సాధించడానికి.. నాలుగో స్థానంలో నిలవడానికి మధ్య చాలా వ్యత్యా సం ఉందని పార్క్‌ చెప్పిన మాటలు నా మనసును బలంగా తాకాయి. వెంటనే నా మైండ్‌ను సెమీస్‌ ఓటమి నుంచి తర్వాత జరగబోయే కాంస్య పతక పోరు వైపు మరల్చా. భావోద్వేగాన్ని నియంత్రించుకున్నా. ఆఖరి మ్యాచ్‌లో నా శక్తి సామర్థ్యాలన్నింటినీ ఫణంగా పెట్టి మెడల్‌ గెలవాలనుకున్నా. సాధించా.


గోపీ అకాడమీ నుంచి  అందుకే వచ్చేశా..

నేను..గోపీచంద్‌ అకాడమీలో కాకుండా గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయడంపై చాలా రోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ, వాటిలో నిజం లేదు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వాతావరణం ఒలింపిక్స్‌ వేదికను పోలి ఉండడంతో మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు ఆస్కారం లభించింది. అక్కడి కోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో  కూడిన ఎయిర్‌ కండిషనర్లు కలిగి ఉన్నాయి. ఒలింపిక్స్‌ వంటి మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతున్నప్పుడు అలాంటి చోట్ల ప్రాక్టీస్‌ చేయడమే సరైన నిర్ణయం అనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నా. గాలివల్ల ఒక్కోసారి షటిల్‌ మన అంచనాకు భిన్నంగా వేరేవైపు వెళుతుంది. గచ్చిబౌలిలో సాధన చేయడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించి షటిల్‌పై నియంత్రణ సాధించా.


తైజును హత్తుకున్నా..

తైజు నాకు మంచి మిత్రురాలు. అయితే, క్రీడల్లో ప్రత్యర్థితో ఆడుతున్నంత సేపూ జాలి చూపించకుండా పోరాడాలి. మేమిద్దరం అదే చేశాం. ఒక్కసారి పోరు ముగిశాక మళ్లీ మా స్నేహం మామూలే. మ్యాచ్‌ ఫలితం వచ్చాక కొన్ని సెకన్లు లేదా నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోవచ్చు. క్రీడాకారులుగా ఆ తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ముఖ్యం. ఓడినప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అందుకే పరాజితుల బాధను అర్థం చేసుకోగలను.  ఫైనల్లో తైజు ఓడినప్పుడు ఆమె ఎంత బాధపడిందో నాకు తెలుసు. పతకాలు తీసుకున్నాక ఆమెకు ఒకమాట చెప్పా. నువ్వు చాలా బాగా ఆడావు. అయితే, ఈ రోజు నీది కాదు. కానీ ఈ సందర్భాన్ని ఆస్వాదించాలని చెప్పి తైజును ఆలింగనం చేసుకున్నా.

పార్క్‌ శిక్షణలోనే..

గత ఐదేళ్లలో ముగ్గురు విదేశీ కోచ్‌ల శిక్షణలో సాధన చేశా. ఇండోనేసియా కోచ్‌ హ్యాండొయో, కొరియా కోచ్‌ కిమ్‌ జి హున్‌.. ఇప్పుడు పార్క్‌. ఈ ముగ్గురివి మూడు భిన్న స్వభావాలు. అయితే, వారినుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ నైపుణ్యాలను అవసరమైనప్పుడు ఉపయోగిస్తున్నా. పార్క్‌ విషయానికి వస్తే నాలుగేళ్ల కిందట అతడు కొరియా జట్టు శిక్షణ బృందంలో ఉన్నప్పటి నుంచే తెలుసు. ఏడాదిన్నర  నుంచి పార్క్‌ నాకు కోచింగ్‌ ఇస్తున్నాడు. ఒలింపిక్‌ మెడల్‌ సాధించాలనేది అతడికి కూడా కలే. అంతిమంగా అది సాధించా. లాక్‌డౌన్‌ సమయంలో పార్క్‌ ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వెళ్లినా 13 రోజులకే తిరిగి భారత్‌ వచ్చేశాడు. నాకోసం అతడు చాలా కష్టపడ్డాడు. అతడితో నా ప్రయాణం ఇక ముందు కూడా కొనసాగుతుంది.


వచ్చే ఒలింపిక్స్‌కు సమయముంది..

2024 (పారిస్‌) ఒలింపిక్స్‌కు చాలా సమయముంది. ప్రస్తుతానికి ఈ మధుర క్షణాలను ఆస్వాదించనివ్వండి. 


గోపీప్రమేయం లేదు

ఈ ఒలింపిక్స్‌ శిక్షణలో కానీ, వ్యూహాల్లో కానీ, గోపీ సార్‌ ప్రమేయమేమీ లేదు. గోపీ సార్‌ ఇతర జూనియర్‌ ప్లేయర్లను తయారు చేయడంలో నిమగ్నమై ఉండడంతో ఫిబ్రవరి నుంచి పూర్తిగా పార్క్‌ నేతృత్వంలోనే శిక్షణ మొత్తం కొనసాగింది. సుచిత్ర అకాడమీ ప్లేయర్లు ప్రాక్టీస్‌ పార్ట్‌నర్లుగా ఒలింపిక్స్‌ శిక్షణలో బాగా సహాయపడ్డారు.


సైనా  విషెస్‌ చెప్పలేదు

పతకం నెగ్గాక గోపీ సార్‌ నుంచి కంగ్రాట్స్‌ అని మొబైల్‌కు సందేశం వచ్చింది. నేను థ్యాంక్యూ అని స్పందించా. సోషల్‌ మీడియాలో అయితే ఏం పెట్టారో చూడలేదు. ఇతర ప్రముఖుల నుంచి కూడా చాలా మెసేజ్‌లు వచ్చాయి. నిదానంగా అందరికీ రిప్లయ్‌ ఇస్తా. సైనా శుభాకాంక్షలు తెలపలేదు. మేమిద్దరం అంత ఎక్కువగా మాట్లాడుకోం.