ఆటకన్నా జీవితం ముఖ్యం

ABN , First Publish Date - 2021-05-17T09:55:49+05:30 IST

కరోనావల్ల భారత్‌, మలేసియా, సింగపూర్‌లో జరగాల్సిన మూడు ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్లను ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) రద్దు చేసింది.

ఆటకన్నా జీవితం ముఖ్యం

టోర్నీల రద్దు సబబే 

ఒలింపిక్స్‌లో కొవిడ్‌ నిబంధనలు సవాలే సింధు


న్యూఢిల్లీ: కరోనావల్ల భారత్‌, మలేసియా, సింగపూర్‌లో జరగాల్సిన మూడు ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్లను ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) రద్దు చేసింది. జూలై-ఆగస్టులో జరిగే టోక్యో క్రీడలకు ముందు షట్లర్లకు ఈ మూడు కీలకమైన టోర్నీలు కావడం గమనార్హం. దీనివల్ల ఒలింపిక్స్‌ సన్నాహకాలకు ఎదురు దెబ్బ తగిలిందా అన్న ప్రశ్నకు స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్పందిస్తూ.. ‘కనీసం సింగపూర్‌ ఓపెన్‌ అయినా నిర్వహిస్తారని మేమంతా ఆశించాం. అది కూడా రద్దు కావడంతో ఇక ప్రత్యామ్నాయం లేదు. దాంతో పలువురు షట్లర్లతో మ్యాచ్‌లు ఆడుతున్నా. అంతర్జాతీయ పోటీలలో ఉండే పరిస్థితులు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో   ఉండేలా మా కోచ్‌ పార్క్‌ సంగ్‌ చర్యలు తీసుకుంటోంది’ అని తెలిపింది.


‘ఒక్కో షట్లర్‌ ఆటశైలి ఒక్కోలా ఉంటుంది. తైజు, రచనోక్‌లది విభిన్న స్టయిల్‌. దాంతో వారిని ఎదుర్కొనేలా పార్క్‌ నన్ను తయారు చేస్తోంది’ అని ప్రపంచ చాంపియన్‌ సింధు వివరించింది. ‘నెలల విరామం తర్వాత ఒలింపిక్స్‌లో ఒకరినొకరం ఎదుర్కోబోతున్నాం. అందువల్ల మా ఆట తీరులో కూడా మార్పు ఉంటుంది. వాటికి తగ్గట్టు సిద్ధం కావాలి’ అని చెప్పింది. ఒలింపిక్స్‌లో పోటీపడే షట్లర్లతో కలిసి సింధు ప్రాక్టీస్‌ చేయడంలేదు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సాధన చేస్తున్న ఆమె.. సుచిత్ర అకాడమీలో శారీర దారుఢ్య శిక్షణ తీసుకుంటోంది. ఇక, ఆట కన్నా జీవితం ముఖ్యమంటున్న సింధు.. కొవిడ్‌తో టోర్నమెంట్లను బీడబ్ల్యూఎఫ్‌ రద్దు చేయడాన్ని సమర్థించింది. ‘చిన్నపాటి వైర్‌సతో ప్రపంచం మొత్తం స్తంభించడం విచారకరం. అయితే క్రీడలకన్నా జీవితం ముఖ్యం కదా’ అని వ్యాఖ్యానించింది. ఒలింపిక్స్‌లో కొవిడ్‌ నిబంధనలను పాటించడం అటు నిర్వాహకులకు ఇటు అథ్లెట్లకు సవాలని చెప్పిన సింధు.. వాటిని ఎలా ఎదుర్కొంటామో చూడాల్సి ఉందన్నది. 

Updated Date - 2021-05-17T09:55:49+05:30 IST