పీవీ చూపిన దారి!

ABN , First Publish Date - 2020-06-28T06:49:58+05:30 IST

దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహరావు! ఆర్థిక మంత్రిగా వాటి అమలులో చురుకైన పాత్ర పోషించింది మన్మోహన్‌ సింగ్‌! దారి చూపింది పీవీ... ఆ దారిలో నడిచింది మన్మోహన్‌! ఆర్థిక వేత్తగా పేరొంది...

పీవీ చూపిన దారి!

  • ఆయన ఓ రాజకీయ యోగి
  • అరుదైన పండితుడు, రాజనీతిజ్ఞుడు
  • ఆర్థికమంత్రిగా నాకు పూర్తి స్వేచ్ఛ
  • భారతీయ ఆత్మకు లోబడి సంస్కరణ
  • నాకు గురువు, మార్గదర్శి
  • మాజీ ప్రధాని మన్మోహన్‌ నివాళులు
  • ‘ఆంధ్రజ్యోతి’ కోసం ప్రత్యేక వ్యాసం
  • నేటి నుంచి పీవీ నరసింహారావు
  • శత జయంత్యుత్సవాలు
  • ‘ఆంధ్రజ్యోతి’ వినతి మేరకు ప్రత్యేక వ్యాసం

సంస్కరణల శక్తినీ, ప్రభావాన్ని అర్థం చేసుకుని అమలు చేయడంలో పీవీ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు జోహార్లు అర్పించాల్సిందే!

ఆయన బహు భాషా పండితుడు. అందువల్ల్ల... ఆయనలో మొత్తం భారత దేశ వ్యక్తిత్వం ప్రతిఫలించేది. కరీంనగర్‌లోనే కాదు... పుణె, బెనారస్‌, ఢిల్లీలో కూడా సులువుగా, ధాటిగా దూసుకెళ్లేందుకు భాషా సామర్థ్యం ఉపకరించింది. పీవీ నరసింహారావు భారత దేశపు మహోన్నత తనయుడు.  నాకు స్నేహితుడు, తాత్వికుడు, మార్గదర్శకుడు! శతజయంతి ఉత్సవాల ప్రారంభం రోజున... ఆయనకు ఇలా నివాళి అర్పించడం ఎంతో సంతోషంగా ఉంది

- మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాని


(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహరావు! ఆర్థిక మంత్రిగా వాటి అమలులో చురుకైన పాత్ర పోషించింది మన్మోహన్‌ సింగ్‌! దారి చూపింది పీవీ... ఆ దారిలో నడిచింది మన్మోహన్‌! ఆర్థిక వేత్తగా పేరొంది, యూజీసీ చైర్మన్‌గా ఉన్న మన్మోహన్‌ను పిలిచి... ‘మీరే నా ఆర్థిక మంత్రి’ అని పీవీ చెప్పారు. ఆ తర్వాత అదే మన్మోహన్‌ పదేళ్లు ప్రధానమంత్రిగా దేశాన్ని  పరిపాలించారు. వారిద్దరిదీ గురు శిష్య సంబంధం! అంతకుమించిన అనుబంధం! ఇప్పుడు... ఆదివారం (పీవీ 99వ జయంతి) నుంచి తెలుగు నాట పీవీ శతజయంతి ఉత్సవాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుసుకున్న మన్మోహన్‌ ఎంతగానో సంతోషించారు. ‘పీవీతో మీ అనుబంధాన్ని పంచుకోండి’ అని ‘ఆంధ్రజ్యోతి’ అడిగిన వెంటనే మన్మోహన్‌ సానుకూలంగా స్పందించారు. జ్ఞాపకాల దొంతరను కదిలించారు. ‘తెలుగు వారి కోసం’ అంటూ ఆ అనుభవాలను అక్షరీకరించారు. ఆ వివరాలు మన్మోహన్‌ మాటల్లోనే.... 


పీవీ నరసింహా రావు ఆధునికుడు. అదే సమయంలో మన సంప్రదాయాలు, సంస్కృతిపై ప్రగాఢ విశ్వాసమున్న అరుదైన పండితుడు. ఆయన మన ఆర్థిక విధానాలకు దిశ చూపించారు. విదేశాంగ విధానాన్నీ నిర్దేశించారు. సమీపం నుంచి చూసిన వారికి... రాజకీయాల్లో ఒక యోగిలా కనిపిస్తారు. 1988లో పీవీ విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఆయనతో  నాకు పరిచయం ఉంది. అప్పట్లో నేను జెనీవాలో సౌత్‌ కమిషన్‌ సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత నేను ఊహించని విధంగా అదే పీవీ మంత్రివర్గంలో సభ్యుడినయ్యాను. 1991లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజే ఆయన నన్ను పిలిపించారు. ‘నేను మిమ్మల్ని ఆర్థిక మంత్రిగా చూడాలనుకుంటున్నాను’ అని సూటిగా చెప్పారు. అయితే... నాకు పూర్తి మద్దతు ఇస్తేనే ఆ పదవిని స్వీకరిస్తానని నేనూ సూటిగానే చెప్పాను. దీనికి పీవీ స్పందిస్తూ.. ‘మీకు పూర్తి స్వేచ్ఛనిస్తాను. విధానాలు విజయవంతమైతే మొత్తం ఘనత మీకు దక్కుతుంది. అవి విఫలమైతే, మీరు తప్పుకోవాల్సి ఉంటుంది’ అని చమత్కరించారు. చెప్పినట్లుగానే... ఆర్థిక సంస్కరణలను అమలు చేసేందుకు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.


సాహసోపేతం

ఆర్థిక సంస్కరణలు అకస్మాత్తుగా జరిగినవి కావు. ఆ రోజుల్లో దూరదృష్టితో ఆలోచించే రాజకీయ నాయకత్వం లేకపోతే చరిత్రాత్మక మార్పులు సంభవించేవి కావు. ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరాన్ని తొలుత ఇందిరాగాంధీ అర్థం చేసుకున్నారు. సామాజిక న్యాయంతోపాటు ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయాలనుకున్నారు. ఆమె తీసుకున్న తొలి చర్యలను రాజీవ్‌ గాంధీ మరింత ముందుకు తీసుకెళ్లారు. నూతన సమాచార యుగం ప్రాధాన్యాన్ని గ్రహించారు. రాజీవ్‌ గాంధీ నాయకత్వంలో 1980వ దశకం ద్వితీయార్థంలో ఆ దశలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయని చెప్పారు. అయితే... సంస్కరణల శక్తినీ, ప్రభావాన్నీ అర్థం చేసుకోవడంలో పీవీ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు జోహార్లు అర్పించాల్సిందే.


భారతీయ ఆత్మతో...

పీవీ హయాంలో ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి మహత్తర నిర్ణయాలు తీసుకున్నాం. తాము ఒక నిర్దిష్టమైన ఫార్ములాకు కట్టుబడలేదని వెల్లడించారు. మేం అనుసరించిన విధానాల్లో భారతీయ అనుభవంలోని విశిష్ట స్వభావం కూడా ఒకటి. ఉదాహరణకు... అప్పట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ కాండెస్స్‌సతో జరిగిన అత్యంత కీలకమైన సమావేశం గురించి చెబుతాను.  ‘భారత దేశంలో సంస్కరణలు చేపట్టినపుడు భారతీయ సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి. మాది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ పనిచేసే మా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలి’ అని మైఖేల్‌కు పీవీ చాలా సూటిగా చెప్పారు. నిర్మాణాత్మక సర్దుబాటు వల్ల ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని కూడా తొలగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. సంస్కరణలు మన ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టాలన్న విధానానికి మేం కట్టుబడి ఉన్నామని బలంగా విశ్వసిస్తున్నాను.


వాస్తవిక దృక్పథం...

ప్రధానమంత్రిగా పీవీ భారత విదేశాంగ విధానాన్ని వాస్తవిక దృక్పథంలో అమలు చేశారు. పొరుగు దేశాలతో భారత దేశ సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. 1993లో చైనాకు వెళ్లి... ఇరుదేశాల సంబంధాల్లో ఏర్పడ్డ కొన్ని వైషమ్యాలను తొలగించేందుకు కృషి చేశారు. ఆయన నేతృత్వంలో భారతదేశం ఇతర సార్క్‌ దేశాలతో కలిసి దక్షిణాసియా ప్రాధాన్యతా వర్తక ఒప్పందంపై సంతకం చేసింది. భారత్‌కు తూర్పు, ఆగ్నేయాసియాలోని అనేక దేశాలతో అనుసంధానిస్తూ వినూత్నమైన ‘లుక్‌ ఈస్ట్‌’ విధానానికి శ్రీకారం చుట్టారు. 1992లో పీవీ నేతృత్వంలో అత్యంత బృహత్తరమైన విధ్వంసక క్షిపణి టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వేగవంతమైన ఉపగ్రహ ప్రారంభ వాహనాన్ని (ఏఎ్‌సఎల్‌వీ), పీఎ్‌సఎల్‌వీని విజయవంతంగా పరీక్షించాం. దీనివల్ల భారత్‌కు రక్షణ మరింత పెరిగింది. 1994లో పృథ్వి క్షిపణి తొలి విజయవంతమైన పరీక్షలు జరిగాయి. ఆ తర్వాతి కాలంలో దాన్ని మధ్యశ్రేణి విధ్వంసక క్షిపణిగా అభివృద్ధి పరిచాం.


Updated Date - 2020-06-28T06:49:58+05:30 IST