పీవీ: కొన్ని మధుర జ్ఞాపకాలు

ABN , First Publish Date - 2020-06-26T08:34:14+05:30 IST

తెలుగు వారిలో మహామేధావి పి.వి. నరసింహారావు. ఆయనకు పధ్నాలుగు భాషలలో ప్రవేశం వుంది. తొలి తెలుగు ప్రధాని మాత్రమే కాదు –మొదటి దక్షిణాది ప్రధాని కూడా...

పీవీ: కొన్ని మధుర జ్ఞాపకాలు

ఆయన విద్యా మంత్రిగా ఉన్నప్పుడే నాకు పరిచయం. అప్పట్లో నేను రాసిన ‘‘ఆంధ్రకేసరి జీవితంలో అద్భుత ఘట్టాలు’’ అనే పుస్తకాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేత ఆరు వందల కాపీలు కొనిపించారు. ఆ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత కొనిపించి, గ్రంథాలయాలకు పంపించాలని నేను కోరగా, ‘‘అంతకంటే భాగ్యమా?’’ అని వినమ్రతతో ఆయన అన్నమాటలను ఇప్పటికీ నా చెవులు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాయి.


తెలుగు వారిలో మహామేధావి పి.వి. నరసింహారావు. ఆయనకు పధ్నాలుగు భాషలలో ప్రవేశం వుంది.  తొలి తెలుగు ప్రధాని మాత్రమే కాదు –మొదటి దక్షిణాది ప్రధాని కూడా.


ఆయన విద్యా మంత్రిగా ఉన్నప్పుడే నాకు పరిచయం. అప్పట్లో నేను రాసిన ‘‘ఆంధ్రకేసరి జీవితంలో అద్భుత ఘట్టాలు’’ అనే పుస్తకాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేత ఆరు వందల కాపీలు కొనిపించారు. 


ఆ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత కొనిపించి, గ్రంథాలయాలకు పంపించాలని నేను కోరగా, ‘‘అంతకంటే భాగ్యమా?’’ అని వినమ్రతతో ఆయన అన్నమాటలను ఇప్పటికీ నా చెవులు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాయి.


పి.వి గారు ఎంత ఎదిగినా, ఎంత పాండితీవిభవ సంపన్నులైనా వినమ్రత ఆయన సొత్తు. ఆయన ప్రధాని అయిన కొత్తలో ఒక సమస్య వచ్చింది. కడప జిల్లాలో భవిష్య ద్రష్ట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి చెందిన వీరబ్రహ్మం అనే ఆయన ఒక రోజున విజయవాడలో నన్ను కలుసుకొని, ఒక ‘‘పజిల్‌’’ నా ముందు పెట్టారు. 


వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఉన్న ‘నరసింహ నామధేయుడు పి.వి. నరసింహారావు గారేనా?’’ అన్నది నా ముందు పెట్టిన ‘‘పజిల్‌’’! వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ మాట చెప్పి నాలుగు వందల సంవత్సరాలైనది. ఢిల్లీ పరిపాలకులలో మరో నరసింహుడు వుంటే, ఈ నాలుగు వందల సంవత్సరాలలోనే ఎప్పుడో ఉండివుండాలి. ఉంటే, ఎప్పుడు ఉన్నాడు?


నేను ఆ నాలుగు వందల సంవత్సరాలలో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన వారిలో ‘‘నరసింహ నాయుడు’’ కోసం చరిత్ర పుటలను కళ్లలో వత్తులు వేసుకుని పరిశీలించాను; పరిశోధించాను. కానీ, ఈ పి.వి. నరసింహా ‘నాయుడు’ మినహా అలాంటి నామధేయుడు మరెవ్వరూ కనిపించలేదు! నేను బ్రహ్మంగారి ‘‘నరసింహ నామధేయుడు పి.వి. నరసింహారావు గారే!’’ అంటూ ఒక ‘‘ధీసిస్‌’’ రాసి, దాన్ని పుస్తక రూపంలో బ్రహ్మంగారి ఆశ్రమానికి సమర్పించాను. ఆ ‘‘ధీసిస్‌’’ను వారు ఒక పుస్తక రూపంలో తెచ్చారు. ఆ కాపీని నేను ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని పి.వి. గారికి సమర్పించాను. 


‘‘వీరబ్రహ్మంగారు చెప్పిన నరసింహ నామ ధేయడు మీరే! అంటూ నేను చెప్పేసరికి, ఆయన ముకుళిత హేస్తాలతో, అర్ధనిమీలిత నేత్రాలతో నాకు అభినందన పూర్వకమైన వందనం చేస్తుంటే, నా కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి! సాక్షాత్తు దేశ ప్రధాని‌ నేను చేసిన కృషిని వినయ పూర్వకంగా అభినందిస్తూ వుంటే, ఎవరికైనా అలాంటి మధుర క్షణాలు ఆనందదాయకాలే! ఆ తరువాత 1991 సెప్టెంబర్‌లో ఢిల్లీ నేషనల్‌ సిటిజన్స్‌ క్లబ్‌ వారు నాకు ‘‘నేషనల్‌ సిటిజన్‌’’. అవార్డు ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి బి.డి.జత్తి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియా వంటి ప్రముఖులు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు. ప్రధాని పి.వి. నాకు అవార్డు ప్రదానం చేస్తూ, ‘నాలుగు రంగాలలో–జర్నలిజం, కళలు, సంస్కృతి, సాహిత్యరంగాలలో అవార్డు మీకు లభించింది’ అని అభినందించారు. అంతేకాదు, తెలుగువారిలో ఆ సంవత్సరం ఆ అవార్డు లభించింది నాకే.


అన్నట్టు, ఆ అవార్డును నేను తీసుకుంటుండగా చూడాలని నా గురుతుల్యులు ఆచార్యరంగా తన స్వస్థలం ప్రయాణం కూడా వాయిదా వేసుకుని ఢిల్లీలో ఉండిపోయారు. అప్పటికే ఆయన వయస్సు 91సంవత్సరాలు! 


పి.వి. గారు ప్రధాని అయిన కొత్తలోనే అప్పటి కృష్ణాజిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్‌ నా చేత ‘‘తొలి తెలుగు ప్రధాని’’ అన్న శ్రీ పి.వి గారి జీవిత చరిత్ర రాయించారు. ఆ గ్రంధాన్ని పి.వి. విజయవాడ వచ్చినప్పుడు సమర్పించగా, ఆయన సంతోషించారు. పీవి విదేశాంగ మంత్రిగా ఉండగా, జరిగిన ఒక ఉదంతం నా జీవితంలో మరపురానిది. ఆయన ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీకి భారత ప్రతినిధి వర్గ నాయకుడుగా ఆ నాడు ప్రపంచాన్ని పీడిస్తున్న నిరాయుధీకరణ సమస్యపై మహోపన్యాసం చేయగా, అది సమితి సభ్యదేశాల ప్రతినిధుల హర్షధ్వానాలు పొందింది (స్టాండింగ్‌ ఒవేషన్‌). అంతటి గౌరవం 1946లో సమితి జనరల్‌ అసెంబ్లీలో శ్రీమతి విజయలక్ష్మీ పండిట్‌కు మాత్రమే దక్కింది. ఆమె ప్రధాని నెహ్రూ సోదరి అన్నది విదితమే. పి.వి. గారికి కూడా అంతటి మహోన్నత గౌరవం లభించినందున, ఆయన స్వస్థలమైన హనుమకొండలో మంత్రులు, అభిమానులు, ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు. సభను ఏర్పాటు చేసిన వి.ఎల్‌ నరసింహారావు నన్ను సభాధ్యక్షుడుగా ఆహ్వానించేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది! ఎక్కడ పి.వి? ఎక్కడ నేను? భారత విదేశాంగ మంత్రి సన్మాన సభకు నేను అధ్యక్షుడినా? అనే సరికి వి.ఎల్‌ నరసింహారావు ‘‘మీ పేరు పి.వి. గారే సూచించారు’’ అనేసరికి నాకు మరింత ఆనందం కలిగింది! ఆ సభకు పి.వి. గారి మిత్రుడు రాష్ట్ర సాంకేతిక శాఖ మంత్రి టి. హయగ్రీవాచారి ముఖ్య అతిధి. సభలో నేను ఐక్యరాజ్య సమితిలో విజయలక్ష్మీ పండిట్‌ ఉపన్యాసాన్ని ప్రస్తావించి, పి.వి గారిని కూడా ఆమెతో పోల్చినప్పుడు ఆయన సంతోషించారు. అయితే, అది ఆయన బాహ్యంగా వ్యక్తంచేయరు. తన ఆనందాన్ని, కృతజ్ఞతలను ముకుళిత హస్తాలతో, అర్ధ నిమీలిత నేత్రాలతో వ్యక్తంచేస్తారు! నాకు అదొక మధురక్షణం.


పీవీ ఒకసారి నా సన్మానానికి సందేశం పంపుతూ.. ‘‘రచయితగా, మేధావిగా శ్రీతుర్లపాటి అంటే నాకు ఎనలేని గౌరవం, అభిమానం ఉన్నాయి. అనేక రంగాలలో ఆయన చేసిన సేవ యువలోకానికి ఉత్తేజం కల్పించగలదని ఆశిస్తున్నాను. మనజాతికి ఆయన ఉపయోగకరమైన సేవలు అందించగలరని ఆశిస్తున్నాను. ఆయన జంటిల్మన్‌ – జర్నలిస్టు’’ అన్నారు.

‘పద్మశ్రీ’ తుర్లపాటి కుటుంబ రావు

(జూన్ 28 నుంచి పీవీ శత జయంత్యుత్సవాలు)

Updated Date - 2020-06-26T08:34:14+05:30 IST