పీవీ సాహిత్య ప్రస్థానం

ABN , First Publish Date - 2020-08-16T05:57:58+05:30 IST

పూర్వప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు అనగానే రాజకీయ చాణక్యుడిగా, సవాళ్లను అధిగమించే సామర్థ్యం కలిగిన పాలనాదక్షుడిగా స్ఫురిస్తారు...

పీవీ సాహిత్య ప్రస్థానం

పీవీలో సాహిత్య కోణం ఒక వ్యాపకం కాదు. భావోద్వేగాన్ని, రసజ్ఞతను ఆకట్టుకునేలా చెప్పడం కోసమే సాహితీ ప్రక్రియను పీవీ వినియోగించేవారు. తన ఉద్దేశాల్ని, తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అక్షర సంపదను ఆవిష్కరించేవారు.


పుట్టి పెరిగిన వాతావరణం, నిజాం హయాంలోని పరిస్థితులు పీవీని ఎంతగానో ప్రభావితం చేశాయి. నిజాం నిరంకుశ పాలనలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలు, అణిచివేత ధోరణికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.


పూర్వప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు అనగానే రాజకీయ చాణక్యుడిగా, సవాళ్లను అధిగమించే సామర్థ్యం కలిగిన పాలనాదక్షుడిగా స్ఫురిస్తారు. కానీ పీవీలో మరో విశిష్ట కోణం... సాహిత్యం. నిత్య విద్యార్థిగా... నిరంతర జ్ఞాన అన్వేషిగా జీవన ప్రయాణం సాగించిన పీవీలో అద్భుత భావ వ్యక్తీకరణ పటిమ కలిగిన సాహిత్యకారుడు ఉన్నాడు. 14 భాషలపై పట్టు కలిగిన పీవీ... వివిధ భాషల్లోని సాహిత్యాన్ని తెలుగులోకి, హిందీలోకి అనుసృజన చేశారు. ఒక భాష నుంచి మరో భాషలోకి ఆయన చేసే అనువాదం... నేరుగా రాసిన సాహిత్యంలానే ఉండేదంటే.. వివిధ భాషలపై ఆయన పట్టు ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ‘వేయి పడగలు’ నవలను పీవీ గారు ‘సహస్ర ఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ గారు హిందీలో రాసిన నవలనే తాను తెలుగులోకి తర్జుమా చేసినట్టు ఉంది అని విశ్వనాథ గారు అనడం విశేషం. పీవీ గారికి సాహిత్యంపై పట్టు ఆ స్థాయిలో ఉండేది.


పీవీ నరసింహారావు గారి సాహిత్యం కాల్పనికమో, పాండిత్యాన్ని చాటుకునే పద ప్రయోగమో కాదు. సమకాలీన సమాజంలోని అంశాలకు అద్దం పట్టే ఆలోచనాత్మక రచన. నిజాం కాలంలో తెలంగాణ సమాజంలో పీడిత జనాల ఆక్రందన, తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రతిబింబించేలా పీవీ గారు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ చరిత్ర గ్రంథంగా చెప్పవచ్చు. పీవీలో సాహిత్య కోణం ఒక వ్యాపకం కాదు. తన భావోద్వేగాన్ని, రసజ్ఞతను ఆకట్టుకునేలా చెప్పడం కోసమే సాహితీ ప్రక్రియను పీవీ వినియోగించేవారు. తన ఉద్దేశాల్ని, తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అక్షర సంపదను ఆవిష్కరించేవారు. భారత దేశ 25వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా 1972 ఆగస్టు 14న అర్ధరాత్రి ముఖ్యమంత్రి హోదాలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో పీవీ గారు తాను రాసిన కవితను చదివి వినిపించారు. సుదీర్ఘమైన ఆ కవిత ఆద్యంతం ఆలోచనాత్మకంగా... ఉత్సాహంగా... ఉత్తేజంగా సాగుతుంది. అందులోని చివరి పంక్తులు పీవీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. సరళమైన భాషతోనే అనిర్వచనీయ అనుభూతిని కలిగించే వాక్యాలివి. 


‘నేనొక చైతన్యోర్మిని

నిస్తుల ప్రగతి శకలమును

ఇది నా సంతత కర్మ

మరే హక్కులు లేవు నాకు

ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ

వెలుగుటయే నా తపస్సు

వెలిగించుట నా ప్రతిజ్ఞ’

సాహిత్యంలో శిఖరాగ్రాలకు చేరిన తెలుగు వాడు పీవీ. సాహిత్యం అంటే ఒక మహా సముద్రం. వేద కాలం నుంచి మొదలుకొని రామాయణ, మహాభారతాలు, పురాణాలు, ప్రబంధాలూ, కవిత్వాలు, పద్యం, గద్యం.. ఇలా సాహిత్య ప్రక్రియలు మానవ పరిణామంలో తమదైన పాత్ర వహిస్తూనే ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు ‘తర్కశాస్త్రం సత్యాన్ని శోధిస్తుంది, విజ్ఞాన శాస్త్రం నిజాన్ని శోధిస్తుంది, కానీ సాహిత్యం మాత్రం మానవీయ వాస్తవాన్ని పరిశీలిస్తుంది.


’ పీవీ సాహిత్యంలో మానవీయతను గమనించవచ్చు. సాహిత్యకారులు తమ చుట్టూ జరుగుతున్న వాస్తవాలకు, కొంత కాల్పనికతను, భావాల్ని, ఉద్వేగాల్ని కలగలిపి అక్షర రూపంగా అందిస్తే అది భవిష్యత్ తరాలకు చరిత్ర గ్రంథంగా.. ఆనాటి కాలమాన పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ సాహిత్యం నుంచి వాస్తవికతను వేరు చేసి, ఆ ఘటనాక్రమాలన్నింటినీ క్రోడీకరించి చరిత్రను పునఃనిర్మిస్తారు చరిత్రకారులు. అలా మనకందిన సాహిత్యంలోని గొప్పతనం రాసే వాడి మానసిక పరిణతి, రచనలలోని లోతు, భాషా ప్రయోగం, శైలిపై ఆధారపడి ఉంటుంది. పాఠకుడి మనసుకు ఎంత హత్తుకునేలా రాస్తే ఆ సాహిత్యం అంత శాశ్వతమౌతుంది. ఆ సాహిత్యకారుడి ప్రతిభాపాటవాలు అంత రాణిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే సాహిత్యకారుడు సమకాలీన సమాజానికి ప్రతినిధి. కొందరు ఇతరులను రంజింపచెయ్యడానికి రాస్తే, మరికొందరు కేవలం సమాచారాన్ని అందియ్యడానికి రాస్తారు. తను పుట్టి పెరిగిన వాతావరణం, నిజాం హయాంలోని పరిస్థితులు పీవీ గారిని ఎంతగానో ప్రభావితం చేశాయి. నిజాం నిరంకుశ పాలనలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలు, అణిచివేత ధోరణికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పీవీ అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించే రచనలే చేశారు. ఆయన ఎప్పుడూ టైమ్ పాస్ సాహిత్యం రాయలేదు.


1940–50ల మధ్య ఆయన రాసిన గొల్ల రామవ్వ, మానావమానాలు, నీలం రంగు పట్టుచీర లాంటి కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు విప్లవ ఛాయలు కలిగి ఉంటే 10, 20 ఏళ్ల తర్వాత రాసిన కథల్లో సమాజంలోని కుళ్లును, ప్రజాజీవితంలో లుప్తమవుతున్న రాజకీయ విలువలను పాఠకులకు తెలియచెప్పడానికి వ్యంగ్యం, హాస్యం సమ్మిళితమైన శైలిని వాడారు. ఆ కాలంలో ఆయన రాసిన కొన్ని కథలు, కథానికలు మంగయ్య గారి అదృష్టం, ద మినిస్టర్, secret of the ballot, forgotten suitcase, the guest, the reshuffle లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇందులోని కొన్ని కథానికలు ఇటీవలే ఆయన archivesలో దొరకడం విశేషం.


‘Insider’ (లోపలి మనిషి) ఆయన ప్రధాన మంత్రి అయిన తర్వాత రాసింది. అందులో పీవీ గారు అభ్యుదయ ఆలోచనలు, తన తాత్విక కోణాన్ని ఆవిష్కరిస్తారు. ఒక విధంగా అది ఆయన ఆత్మ కథ. ఒక ఆదర్శవాది రాజకీయాల్లో ఎదుర్కొన్న సమస్యలు, అతని చుట్టూ నడుస్తున్న కుతంత్రాలు, కుయుక్తులు, వాటిని చేధించిన తీరు, తన విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో వివరించారు. అలాగే గ్రామీణ భారతాన్ని భూ సంబంధిత సమస్యలు ఎలా ప్రభావితం చేస్తాయి. వాటికి పరిష్కారం ఏమిటి? అలాగే రాజకీయాల్లో చీకటి కోణాలు, అవినీతి, బంధుప్రీతి ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో వెలుగులోకి తెచ్చారు. గాలి, ఆకాశం లాగానే భూమి సమష్టి వారసత్వం. ఒకరి పేరుతో ఎందుకు బంధించి ఉండాలి? అనే మౌలిక ప్రశ్న లేవనెత్తారు.


పీవీ గారు రాజకీయాల్లోకి రాకపోతే... అలాగే సాహిత్య రంగంలో లేకపోతే ఎలా ఉండేది? ఆయనది సైన్స్ నేపథ్యం. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు... ఆక్్సఫర్డ్, కేంబ్రిడ్జిలో ప్రొఫెసర్‌గా స్థిరపడాలని బలమైన కోరిక. కానీ విధి బలీయమైంది.. రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. జ్ఞానాన్ని సంపాదించాలనే జిజ్ఞాస ఆయన పుస్తకాలు చదివి తీర్చుకున్నారు. ఆ క్రమంలో అద్భుత సాహిత్యకారుడిగా ఎదిగారు. ఆయనలో ఉన్న విప్లవతత్వం... నిజాం వ్యతిరేక పోరాటం వైపు లాక్కెళ్ళింది. తన ప్రమేయం లేకుండానే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే, విద్యార్థిగా ఉన్నప్పటి ఆయన కోరికకు ఆయన కొనసాగిన రంగాలకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన కేవలం జ్ఞాన తృష్ణ తీర్చుకోవడానికి సాహిత్య రంగాన్ని, అలాగే పేదల బ్రతుకుల్లో మార్పు తేవాలనే తపన వల్ల రాజకీయ రంగం ఎంచుకున్నారు. ఆయన్ని ఆయా రంగాలు అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. పీవీ నిజంగా కలలు కన్న ఖగోళాశాస్త్ర రంగం ఎంచుకుంటే ఆయన ఏ స్థాయికి వెళ్ళేవాడో ఊహించడం కష్టం. బహుశా ప్రపంచం ఒక అద్భుతమైన శాస్త్రవేత్తను కోల్పోయిందేమో. మన దేశ ప్రజలు చేసుకున్న అదృష్టం - ఆయన ఆ రంగం వైపు పోలేదు... అదే దైవ నిర్ణయం.

పి.వి. ప్రభాకర రావు

వ్యాసకర్త పీవీ నరసింహారావు తనయుడు

Updated Date - 2020-08-16T05:57:58+05:30 IST