అధికారులను జైల్లో పెడితే ఆక్సిజన్ వస్తుందా? : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-05-05T21:28:54+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విలయం సృష్టిస్తున్న సమయంలో

అధికారులను జైల్లో పెడితే ఆక్సిజన్ వస్తుందా? : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విలయం సృష్టిస్తున్న సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. ఆక్సిజన్ లేకపోవడంతో కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడదామని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అధికారులను జైలుకు తరలించడం వల్ల ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ రాబోదని తెలిపింది. మే 1 నుంచి ఢిల్లీ నగరానికి సరఫరా చేసిన ఆక్సిజన్ వివరాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 


ఢిల్లీ హైకోర్టు మంగళవారం జారీ చేసిన కోర్టు ధిక్కార హెచ్చరికపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అపీలును సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్-19 రోగులకు చికిత్స కోసం ఆక్సిజన్ సరఫరాపై ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోని అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. 


ఢిల్లీలో ఈ మహమ్మారి చాలా తీవ్రమైన స్థితిలో ఉందని, మే 3 నుంచి ఈ నగరానికి రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అధికారులను జైలులో పెట్టినంత మాత్రానికి నగరానికి ఆక్సిజన్ రాబోదని పేర్కొంది. ప్రాణాలను కాపాడటంపై మనం దృష్టిపెడదామని పేర్కొంది. గడచిన మూడు రోజుల్లో మీరు ఎంత ఆక్సిజన్ సరఫరా చేశారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంఆర్ షా కూడా ఉన్నారు. 


సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఇది ఇద్దరు ప్రత్యర్థుల మధ్య వివాదం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నవని తెలిపారు. ఈ ప్రభుత్వాలు కోవిడ్-19 రోగుల కోసం తాము చేయగలిగినదంతా చేస్తున్నాయన్నారు. 


Updated Date - 2021-05-05T21:28:54+05:30 IST