May 7 2021 @ 20:51PM

‘గల్లీ రౌడీ’లోని ‘పుట్టెనే ప్రేమ ప‌డ‌గొట్టెనే ప్రేమ..’ పాట విడుదల

యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా కె.ఎఫ్.సి, ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. నేహ హీరోయిన్. శుక్రవారం(మే 7న) సందీప్ కిషన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘పుట్టినే ప్రేమ..’ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.


‘‘పుట్టెనే ప్రేమ ప‌డ‌గొట్టెనే ప్రేమ ఏం చేశావో ఏమో క‌ద‌మ్మా

ఇంత‌లో ప్రేమ అంత‌లో కోమా, అత‌లా కుత‌లం అవుతున్నాన‌మ్మా..’’ అంటూ ప్రేయసి ప్రేమలో పడిన గల్లీరౌడీ పాడుకునే ఈ పాటకు రామ్ మిర్యాల సంగీతం అందించగా.. భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పాట సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యేలా చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటోంది. పాట పాడుకుంటున్న ఈ రౌడీని ప్రేమ‌లో ప‌డేసిన అమ్మ‌డు వెనుక అస‌లు క‌థేంటో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేన‌ని అంటున్నారు ‘గల్లీ రౌడీ’ నిర్మాత‌లు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించే డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి, మరోసారి తనదైన స్టైల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాతలు చెబుతున్నారు. కామెడీ కింగ్, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ రోల్‌తో ప్రేక్షకులకు నవ్వులను పంచబోతున్నారని, బాబీ సింహ కీల‌క పాత్ర‌లో న‌టించారని వారు తెలిపారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని వారు ప్రకటించారు.