పుతిన్‌ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-23T07:15:43+05:30 IST

రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దేశాన్ని ఉద్దేశించి, మరీముఖ్యంగా పాశ్చాత్యదేశాలనూ లక్ష్యంగా పెట్టుకొని చేసిన ప్రసంగం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది...

పుతిన్‌ హెచ్చరిక

రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దేశాన్ని ఉద్దేశించి, మరీముఖ్యంగా పాశ్చాత్యదేశాలనూ లక్ష్యంగా పెట్టుకొని చేసిన ప్రసంగం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిని ఉన్న స్థితిలో నెమ్మదిగా కాలు వెనక్కుతీసుకొనే ఆలోచనలో ఆయన ఉన్నాడన్న నమ్మకాన్ని ఈ ప్రసంగం వమ్ముచేసింది. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే లక్ష్యంతో ఆయన ప్రకటించిన చర్యలు భయపెడుతున్నాయి. మూడులక్షలమంది సైన్యాన్ని సమీకరించడం, తన దేశాన్నీ, ప్రజలనూ రక్షించుకోవడం అవసరమైతే అణుదాడులకూ దిగుతాననడం రష్యా అధ్యక్షుడి వీరంగానికి పరాకాష్ఠ.


ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌తో ఘర్షణకు దిగేటప్పుడు ఆయన అది ఓ చిన్నపాటి పరిమిత చర్యతో ముగిసిపోతుందని అనుకున్నాడు. లక్షన్నరమంది సైనికులతో ఉక్రెయిన్‌ను నలుదిక్కులా చుట్టుముట్డాడు. కానీ, కదనరంగంలోకి ప్రవేశిస్తే కానీ ఆయనకు ప్రమాద తీవ్రత అర్థంకాలేదు. ఉక్రెయిన్ సైన్యం స్వశక్తికితో పాటు వెనుకనుంచి అండదండలు అందించిన అమెరికా, యూరప్ సైనిక, ఆర్థిక శక్తి తోడై రష్యా తీవ్రంగా దెబ్బతిన్నది. సైనికులను పెద్ద ఎత్తున కోల్పోయిన రష్యా ఆర్థికంగానూ దెబ్బతిన్నది. ఒక దిక్కున ముందడుగుపడితే మరో దిక్కున వెనక్కు తగ్గవలసివచ్చింది. ఆరంభంలో చేజిక్కించుకున్న ప్రాంతాలను నిలబెట్టుకోవడానికి, మరోచోట సైన్యాన్ని వెనక్కు మళ్ళవలసిందిగా చెప్పవలసి వచ్చింది. ఈనెల ఆరంభంలో ఖర్కీవ్‌లో ఉక్రెయిన్ ఎదురుదాడిని భరించలేక రష్యా సైన్యం ప్రాణరక్షణకు పరుగులు తీయడం పుతిన్‌కు పెద్ద అవమానం. ఉక్రెయిన్‌లోని కొత్త భూభాగాల్లోకి చొరబడలేక, ఉన్నవాటిని కోల్పోతున్న ఈ స్థితిలోనే ఇప్పుడు రష్యా తన నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ విన్యాసానికి తెరదీసింది. తూర్పున ఉన్న లుహాన్స్క్, దోనెట్స్క్, దక్షిణాన ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా అంతర్భాగాలుగా విలీనం చేసేందుకు, ఈ ప్రాంతాల్లోని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఈ రెఫరెండమ్ ప్రకటించారు. ఉపరితలంలో ఇది ప్రజాభిప్రాయంగా కనిపించవచ్చును కానీ, అంతిమంగా అది రష్యాకు సానుకూలంగానే ఉంటుందనడంలో సందేహం అక్కరలేదు. ఈ నిర్ణయంతో రష్యా మరో తీవ్రమైన పరిస్థితిని సృష్టించింది. యుద్ధానికి ముందున్న సరిహద్దుల ప్రాతిపాదికగా, ద్వైపాక్షిక చర్చలతో యుద్ధాన్ని ముగించే అవకాశాలకు వీల్లేకుండా చేసింది. ఒక కొత్త వివాదాన్ని సృష్టించి శాంతియుత పరిష్కారానికి తలుపులు మూసేసింది.


పాక్షిక సైనిక సమీకరణ పేరిట పౌరులను యుద్ధానికి తరలించే చర్య అప్రదిష్టపాల్జేస్తుందన్న విషయం పుతిన్‌కు తెలియనిదేమీ కాదు. తమను సైన్యంలోకి తరలించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ రష్యన్లు రోడ్లమీదకు వస్తున్నారనీ, యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. చాలామంది ఇళ్ళనూ ఆస్తులనూ వదిలి విమానాల్లో రిటర్న్ టికెట్లు కూడా తీసుకోకుండా దేశాన్ని విడిచిపోతున్నారనీ, వందలాదిమందిని పోలీసులు అరెస్టు చేస్తున్నారనీ వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజానిజాలు అటుంచితే, ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గే ఆలోచనలో రష్యా లేదని పుతిన్ ప్రకటన తెలియచెబుతోంది. దెబ్బతిన్న పులిలాగా పుతిన్ వైఖరి ఉన్నది. అవమానాన్ని తట్టుకోలేని స్థితిలో ఆయన ఎంతటి దుశ్చర్యలకైనా పాల్పడే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే యుద్ధం యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో, నరేంద్రమోదీ ఇటీవల షాంఘై సహకార సంస్థ సమావేశంలో పుతిన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, అందుకు ఆయన సానుకూలంగా ప్రతిస్పందించిన తీరు అందరికీ గుర్తుకు వస్తున్నది. చైనా సైతం తనకు వ్యతిరేకంగానే ఉన్నదని పుతిన్ ఆ సందర్భంగా చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ కూడా యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారంటూ ఓ ప్రకటన చేశారు. నాటో కూటమి సభ్యదేశమే అయినప్పటికీ, టర్కీతో రష్యాకు సత్సంబంధాలే ఉన్నాయి. మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ఎర్డొగాన్ ఎప్పటినుంచో అంటున్నారు. ఈ నేపథ్యంలో, అటు పాశ్చాత్యదేశాల మీదా, ఇటు రష్యామీద ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని సత్వరంగా ముగించేందుకు టర్కీ, భారతదేశం సంకల్పించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-09-23T07:15:43+05:30 IST