మాస్కో : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఆరంభమయ్యాక.. పాశ్చాత్య దేశాలపై అనుకూల వైఖరి ప్రదర్శించిన రష్యన్లపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ వంటకాలు, అక్కడి వాతావరణంపైనే వీరికి మోజు.. మనసంతా అక్కడే ఉంది. ఇక్కడి ప్రజలతో లేదు అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఎందుకంటే రష్యా నుంచి యూరప్ దేశాలకు ప్రయాణాలు అంతలా సాగాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన చిన్నకూతురు కేథరీనా టిఖోనోవాతోపాటు రష్యా ప్రభుత్వ అధికారులు కూడా చాలా సార్లు యూరప్ ప్రయాణం చేశారు. ఒకటి రెండు.. రెండు కాదు ఎన్నో సార్లు జర్మనీకి వెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా ఇన్నిసార్లు ఎందుకు జర్మనీ వెళ్లారని రష్యాకు చెందిన స్వతంత్ర మీడియా సంస్థ ఐస్టోరీస్, జర్మనీ మెగజైన్ డెర్ స్పైజెల్ ఉమ్మడిగా ఆపరేషన్ నిర్వహించగా సందేహాలు రేకెత్తించే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ రెండు సంస్థలు సేకరించిన ఫ్లైట్ రికార్డుల ప్రకారం పుతిన్ చిన్న కూతురు కేథరీనా టిఖోనోవా 2017 నుంచి 2019 మధ్యకాలంలో 50కిపైగా సార్లు జర్మనీలోని మ్యూనిచ్కు వెళ్లారు. రష్యా ప్రభుత్వ అధికారుల అండతో ఛార్టెర్డ్ విమానాల్లో ఆమె ప్రయాణాలు చేశారు. అంతేకాకుండా పుతిన్ అధ్యక్ష కార్యాలయం సెక్యూరిటీ సర్వీస్ ఉద్యోగులతో కలిసి కూడా ఆమె అక్కడి వెళ్లారు.
అయితే వరుస విమాన ప్రయాణాలకు సంబంధించిన లీకైన పత్రాల్లో ఓ రెండేళ్ల పాప, ఆమె పాస్‌పోర్ట్ వివరాలు ఎన్నో సందేహాలకు ఆజ్యంపోస్తున్నాయి. ఈ పాపను వ్లాదిమిర్ పుతిన్ మనువరాలు.. అంటే కేథరీనా టిఖోనోవా బిడ్డగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పాప తండ్రే కేథరీనా టిఖోనోవా భాగస్వామి అయ్యివుండొచ్చనే రిపోర్టులో అనుమానాలు వ్యక్తమయ్యాయి. జర్మనీకి చెందిన మ్యూనిచ్ స్టేట్ బ్యాలెట్(ఒక రకమైన నృత్య రూపకం) మాజీ డైరెక్టర్ ఇగోర్ జెలెన్స్కీ పాప తండ్రిగా, టిఖోనోవా భాగస్వామి అవ్వొచ్చని ఇన్వెస్టిగేషన్ రిపోర్టు సందేహాలు వెలిబుచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఇద్దరి ఇంటి పేర్లు కలవడం జనాల్ని ఆకర్షిస్తోంది.
52 ఏళ్ల వయసున్న ఇగోర్ జెలెన్స్కీ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న డ్యాన్సర్. 2016లో జర్మనీ బయెరిస్కెస్ స్టాట్స్బ్యాలెట్కు ఆర్టిస్టిక్ డైరెక్టర్‌గా నియామకమయ్యాడు. అయితే ఆసక్తికరంగా ఏప్రిల్ 4న కుటుంబ ప్రైవేటు వ్యవహారాలను కారణంగా చూపుతూ ఈ పదవి నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు ఉక్రెయిన్‌పై అధ్యక్షుడు పుతిన్ సైనిక చర్యను ఏ సందర్భంలోనూ ఖండించలేదు. మరో విషయం ఏంటంటే రష్యా నేషనల్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డ్‌లో ఎంతోకాలంగా పర్యవేక్షకుడిగా కొనసాగుతున్నారు. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ పుతిన్ కూతురి టిఖోనోవా భాగస్వామి ఇగోర్ జెలెన్స్కీ అవ్వొచ్చని జర్మనీలోని బావరియాన్ స్టేట్ బ్యాలెట్ వర్గాలు కూడా అనుమానపడ్డాయి. వారి బంధంపై జర్నలిస్టులు ప్రశ్నించేంత వరకు సందేహంగానే నడుచుకునేవారని ఇన్వెస్టిగేషన్లో బయటపడింది.
కాగా 35 ఏళ్ల వయసున్న టిఖోనోవా మాజీ రాక్ అండ్ రోల్ డ్యాన్సర్. గతంలో ఆమె కిరిల్ షమలోవ్ పెళ్లిచేసుకున్నారు. అయితే 2018లో వీరివురూ విడిపోయారు. కాగా 2017లో జన్మించిన బిడ్డ పేరు, వివరాలను మాత్రం డెర్ స్పైజెల్, ఐస్టోరిస్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించలేదు. కానీ బిడ్డ సంరక్షుడి పేరు ఇగోరెవ్నాగా ఉంది. ఇది ఇగోర్ జెలెన్స్కీ అయ్యుండొచ్చనే సందేహాలు వ్యక్తపరిచాయి. కాగా ఈ రిపోర్టులపై టిఖోనోవా కూడా ఇంతవరకు స్పందించలేదు.