మంత్రాలయంలో రద్దీ

ABN , First Publish Date - 2020-11-25T06:02:20+05:30 IST

తుంగభద్ర పుష్కరాల ఐదోరోజు మంగళవారం మంత్రాలయం ఘాట్లలో భక్తుల రద్దీ కనిపించింది.

మంత్రాలయంలో రద్దీ
మంత్రాలయంలో భక్తుల రద్దీ


 తుంగభద్ర పుష్కరాల ఐదోరోజు మంగళవారం మంత్రాలయం ఘాట్లలో భక్తుల రద్దీ కనిపించింది. సంగమేశ్వరంలో కాస్త తక్కువగా కనిపించారు. భక్తులు షవర్ల వద్దే స్నానం ఆచరించారు. మహిళలు సంగమేశ్వరంలోని సప్తనదీ జలాల్లో దీపాలు వదిలి వాయనాలను సమర్పించారు. మంత్రాలయానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. చాలామంది కుటుంబ సభ్యులతో వచ్చారు. మఠం ఘాట్‌, సంత మార్కెట్‌ ఘాట్‌, వినాయక ఘాట్‌ వద్ద షవర్ల కింద స్నానాలు చేశారు. నదీమతల్లికి సారె సమర్పించి దీపాలను వెలిగించి నీటిలో వదిలారు. కర్నూలు నగర పరిధిలో రద్దీ ఏమాత్రం కనిపించలేదు. 

- మంత్రాలయం/ఆత్మకూరు




 మన నది కదా..

గూడూరు మండలానికి చెందిన కొందరు ముస్లిం మహిళలు మంగళవారం సుంకేసుల పుష్కర ఘాట్‌ వద్దకు వచ్చారు. తుంగభద్ర నీరు తలపై చల్లుకున్నారు. మొదటి సారిగా పుష్కరాలకు రావడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. ‘మన ప్రాంతంలో పారే నదికి వేడుకలు జరుగుతున్నాయి. ఏ మతం అయితేనేం.. దేవుడు అందరికీ ఒక్కటే. అందుకే వచ్చి పుణ్యస్నానాలు చేశాం’ అని అన్నారు. 

- కోడుమూరు



 చిన్న వ్యాపారి

మంత్రాలయం మఠం ఘాట్‌ వద్ద మాస్కులు, వాటర్‌ బాటిళ్లను అమ్ముతున్నాడు ఈ చిన్నారి వ్యాపారి. వణికించే చలిలో ఇలా ఒక చోట కూర్చుని తెల్లవారు జామునే అమ్మకాలు మొదలు పెట్టాడు. ఈ బాలుడి తల్లి ఘాట్‌ వద్ద తిరుగుతూ దీపాలు, పసుపు కుంకుమ అమ్ముతోంది. ఒంటికి లుంగీ చుట్టుకుని అమ్మకు తోడుగా ఇలా తనవంతు వ్యాపారం చేస్తూ కనిపించాడు. 

- ఎమ్మిగనూరు టౌన్‌

Updated Date - 2020-11-25T06:02:20+05:30 IST