పుష్కర స్నానం

ABN , First Publish Date - 2020-11-30T06:01:17+05:30 IST

తుంగభద్ర పుష్కర మహోత్సవాలు ముగింపుకు చేరాయి. ఆదివారం పదో రోజు ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో భక్తులు తరలివచ్చారు.

పుష్కర స్నానం
సంకల్‌ భాగ్‌ వద్ద స్నానాలు చేస్తున్న భక్తులు

  1. పదోరోజుకు చేరిన తుంగభద్ర పుష్కరాలు 
  2. ఘాట్ల వద్ద భక్తుల సందడి


తుంగభద్ర పుష్కర మహోత్సవాలు ముగింపుకు చేరాయి. ఆదివారం పదో రోజు ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో భక్తులు తరలివచ్చారు. ప్రారంభం నుంచి భక్తులు లేక ఘాట్లు వెలవెలబోయాయి. మంత్రాలయం, సంకల్‌బాగ్‌, సంగమేశ్వరం, సుంకేసుల, గురజాల, ఘాట్లకు భక్తులు పోటెత్తారు. స్నానాలు చేసి పూజలు చేశారు. సాయంత్రం నదిలో కార్తీక దీపాలు వదిలారు. 


మంత్రాలయం, ఎమ్మిగనూరు టౌన్‌, కర్నూలు(న్యూ సిటీ/ఎడ్యుకేషన్‌)/హాస్పటల్‌, కోడుమూరు (రూరల్‌), జూపాడుబంగ్లా,  నవంబరు 29:   తుంగభద్ర పుస్కరాల సందర్భంగా ఆదివారం సుంకేసుల పుస్కర ఘాట్‌కు భక్తుల రద్దీ పెరిగింది. మరో రెండు రోజుల్లో పుస్కరాలు ముగియనున్న నేపథ్యంలో, అలాగే ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తరలివచ్చారు. సమీప పల్లెలతో పాటు కర్నూలు, తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు పుస్కరస్నానం చేయడానికి పెద్ద ఎత్తున విచ్చేశారు. కొందరు సంప్రదాయం ప్రకారం పితృ దేవతలకు పిండ ప్రదానం చేశారు. ఆదివారం 3,500 మంది వరకు భక్తులు వచ్చారని, పిండ ప్రదానాలు 37, కరోనా టెస్టులు 10 నిర్వహించగా, ఫలితాలు నెగెటివ్‌ వచ్చినట్లు నోడల్‌ అధికారి రఘురాం తెలిపారు. ఏఆర్‌ డీఎస్పీ లక్ష్మీనారా యణరెడ్డి, సీఐ పార్థసారథిరెడ్డి అధ్వర్యంలో ఎస్‌ఐలు మల్లికార్జున, నాగార్జున బందోబస్తు చేపట్టారు. నాగలాపురానికి బెస్త కుటుంబాలకు చెందిన మహిళలు ఆదివారం సుంకేసుల పుస్కర ఘాట్‌కు చేరుకుని పూజలు చేశారు.


సుంకేసుల పుస్కరఘాట్‌ను ఆదివారం తెలంగాణ అడిషనల్‌ డీజీపీ, గ్రేహౌండ్స్‌ ఆక్టోపస్‌ శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆయనకు డీఎస్పీ, సీఐ అధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుస్కర స్నానమాచరించిన అడిషనల్‌ డీజేపీ నదీమతల్లికి ప్రత్యేక పూజలు జరిపించారు. సుంకేసుల వాతావరణం చిన్నప్పటి నుంచి పరిచయం అని, సమీప కొత్తకోట తన స్వగ్రామం అని తెలిపారు. సొంత ప్రాంతంలో జరుగుతున్న పుస్కరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 


 నగరంలోని మాసామసీదు దగ్గర ఉన్న పంప్‌హౌస్‌ పుష్కర ఘాట్‌కు మహిళలు పోటెత్తారు. 10వ రోజు ఆదివారం పుష్కర ఘాట్‌కు 1391 భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. వైద్య శిబిరం ద్వారా 767 మంది భక్తులకు స్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. షవర్‌బాత్‌లో 995 మంది భక్తులు స్నానమాచరించగా, పిండ ప్రధానంలో 126 మంది భక్తులు పాల్గొన్నట్లు పుష్కర ఘాట్‌ ఇన్‌చార్జి రామాంజినేయులు తెలిపారు. 


మహిళల జలహారతి: కార్తీక పౌర్ణమి సందర్భంగా పుష్కర ఘాట్‌లో తుంగభద్ర నదికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నదీమ తల్లికి పూజలు చేసి వాయినాలు సమర్పించారు. దీంతో పంప్‌హౌస్‌ ఘాట్‌ కార్తీక శోభ సంతరించుకొంది. సాయంత్రం ఘాట్‌ పండితులు కేఎన్‌ శాస్త్రి ఆధ్వర్యం లో తుంగభద్ర నదీమ తల్లికి జలహారతి నిర్వహించారు.  


అనాథ చిన్నారులకు...

పోలీసు అధికారులు 28 మంది అనాథ చిన్నారులకు పుష్కర పూజోత్సవంలో పాల్గొనే ఏర్పాట్లు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప సూచనల మేరకు పెద్దపాడు ప్రభుత్వ అనాఽథ ఆశ్రమంలోని 16 మందిని, డాన్‌ బాస్కో నవజీవన్‌ అనాథ ఆశ్రమం నుంచి 12 మంది  చిన్నారుల చేత పుష్కర పూజలను నిర్వహింపజేశారు. వారికి ఉలన్‌ రగ్గులు, మాస్కులు, శానిటైజర్లు, స్వీట్‌ ప్యాకెట్లు, పెన్నులను హోంగార్డు కమాండెంట్‌ యు. రామ్మోహన్‌ అందజేశారు. 


పాపాలు తొలగుతాయి..

 పుష్కర స్నానాలతో పాపాలు తొలగిపోతాయని సంస్కృత పాఠశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ నరసింహమూర్తి అన్నారు. హైదరాబాదు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సుంకేసుల ఘాట్‌లో వేదమంత్రాలు పఠిస్తూ మునకలు వేశారు. అనంతరం పితృదేవతలకు తర్పణం వదిలారు. 


కుటుంబంతో కలిసి...

 తుంగభద్ర పుష్కరాలకు చాలామంది కుటుంబ సమేతంగా వస్తున్నారు. గూడూరుకు చెందిన గంగారాం, మునగాలకు చెందిన ఎల్లమ్మ కుంటుంబాలు మొత్తం 20 మంది వచ్చి సుంకేసుల ఘాట్లఓ పుణ్యస్నానం చేశారు. కృష్ణానది పుష్కరాలకు బీచుపల్లికి వెళ్లామని, తుంగభద్ర పుష్కరాల్లో రెండోసారి పాల్గొంటున్నామని ఎల్లమ్మ, గంగారాం తెలిపారు. 


అమ్మ కోరిక

ఎనిమిది పదుల వయసు రత్నమ్మది. జూపాడుబంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామం. తోడు లేనిదే నడవలేదు. తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం చేయాలని ఉందని కొడుకు సత్యనారాయణరెడ్డికి తెలిపింది. దీంతో ఆయన తన భార్య శ్రీదేవి, పిల్లలతో కలిసి మాతృమూర్తి రత్నమ్మను సుంకేసుల ఘాట్‌కు పిలుచుకువచ్చారు. కొడుకు, కోడలు ఆసరాగా నిలిచి తుంగభద్రమ్మలో స్నానం చేయించి జాగ్రత్తగా ఒడ్డున కూర్చోబెట్టారు. ఆనంతరం వారు పిల్లలతో కలిసి పుష్కర స్నానం చేసి పూజలు నిర్వహించారు. పూజా విధానం గురించి రత్నమ్మ వారికి సలహాలు ఇస్తూ కనిపించింది. కొడుకు, కోడలు కంటికి రెప్పలా చూసుకుంటున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. 


మంచినీరు కాదు.. ప్యాకెట్లే..

 పుష్కరాల్లో భక్తులకు వాటర్‌ బాటిళ్లు, ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరాఫరా చేయాలి. వాటర్‌ ఫ్యాకెట్లను అసలు పంపిణీ చేయరాదు. కానీ మంత్రాలయం మఠం ఘాట్‌ వద్ద కాంట్రక్టర్లు ప్యాకెట్లనే పంపిణీ చేస్తున్నారు. వీటిపై తయారు చేసిన తేదీలను కూడా ముద్రించలేదు. దీంతో భక్తులు వాటిని తీసుకొనేందుకు తిరస్కరిస్తున్నారు

Updated Date - 2020-11-30T06:01:17+05:30 IST