Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 17 Dec 2021 15:37:34 IST

సినిమా రివ్యూ : ‘పుష్ప ది రైజ్’

twitter-iconwatsapp-iconfb-icon
సినిమా రివ్యూ : పుష్ప ది రైజ్

చిత్రం : ‘పుష్ప ది రైజ్’

విడుదల తేదీ : 17డిసెంబర్ 2021

నటీనటులు : అల్లు అర్జున్, రష్మికా మందణ్ణ, రావురమేశ్,  సునీల్, అజయ్, శ్రీతేజ్, మిమే గోపీ, ధనంజయ్, ఫహద్ ఫాజిల్, అజయ్  ఘోష్, శత్రు, జగదీష్, బ్రహ్మాజీ, అనసూయ తదితరులు 

సంగీతం : దేవీశ్రీప్రసాద్

ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్, రూబెన్

సినిమాటోగ్రఫీ : మిరాస్లావ్ క్యూబా బ్రోజెక్ 

నిర్మాణం : మైత్రీ  మూవీస్, ముత్తం శెట్టి మీడియా

కథ - స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : బి.సుకుమార్ 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్  కాంబినేషన్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతకు ముందు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన‘ఆర్య’ సిరీస్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.  ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్, ‘అల వైకుంఠపురములో’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ కాంబినేషన్ లోని మూడో సినిమా..  మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ థియేటర్స్ లోకి ఈ రోజే (శుక్రవారం) వచ్చింది. తగ్గేదేలే .. అంటూ విడుదలకు ముందు తెగ  హడావిడి చేసిన అల్లు అర్జున్ .. ఈ సినిమాతో మాట నిలబెట్టుకున్నాడా లేదా? ఫ్యాన్స్ కి ఎలాంటి మాస్ ఫీస్ట్ ఇచ్చాడు? అన్న విషయాలు రివ్యూలో చూద్దాం..

కథ

రాయసీమలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను కొడుతున్న కూలి పుష్పరాజ్ (అల్లు అర్జున్) ను పోలీసులు అరెస్ట్ చేసి  చితక్కొట్టి.. అతడి వెనుక ఎవరున్నారో కూపీ లాగాలని ప్రయత్నిస్తారు. స్మగ్లింగ్ చేయించేది పుష్పరాజ్ అని అసలు విషయం దాటవేస్తాడు. ఇంతలో అతడికి కొండారెడ్డి (అజయ్ ఘోష్ ) బైల్ ఇప్పించి బైటికి తీసుకొస్తాడు. కొండారెడ్డిలాంటి కొందరు మనుషులతో సిండికేట్ గా ఏర్పడి.. వారిచేత మంగళం శ్రీను (సునీల్ ) స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. పుష్ప తన తెలివితేటలతో సరుకును గమ్యానికి చేరవేసి మంగళం శ్రీను సిండికేట్ లో వాటాదారుడిగా ఎదుగుతాడు. ఇంతలో పుష్పకి మంగళం శ్రీను సిండికేట్ సభ్యుల్ని మోసం చేస్తూ తాను ఎక్కువ లాభాలు అందుకుంటున్నాడని తెలుసుకుంటాడు. దాంతో మంగళం శ్రీనుకే పుష్ప వార్నింగిచ్చి.. ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ముందుకు దూసుకుపోతాడు. ఈ క్రమంలో పుష్పకి కొండారెడ్డి, మంగళం శ్రీను లతో శత్రుత్వం ఏర్పడుతుంది. వాటి మధ్యనే పుష్పకి శ్రీవల్లితో ప్రేమాయణం, మదర్ సెంటిమెంట్.. కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫజిల్ ) తో ఎదురయ్యే సవాళ్లు  ఏంటన్నదే మిగతా కథ.   

విశ్లేషణ

మూడు గంటల నిడివి కలిగిన చిత్రాలు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా వచ్చాయి. రెండు భాగాలుగా వచ్చే ‘పుష్ప’  మొదటి భాగాన్నే దర్శకుడు సుకుమార్ అంత నిడివితో చెప్పడం విశేషమనే చెప్పాలి. అలాగే.. ఈ సినిమా కోసం సుకుమార్ వెబ్ సిరీస్ శైలిలో కథనాన్ని ఎలబరేటివ్ స్టైల్లో ఆవిష్కరించడం మెచ్చుకోదగ్గది. ఇంతకు ముందు ఎర్రచందనం స్మగ్లింగ్ మీద తమిళంలో ‘కెప్టెన్ ప్రభాకర్’ లాంటి సినిమాలొచ్చాయి. కానీ  వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనం  స్మగ్లింగ్ విధానాన్ని అందులో అంత డీప్ గా డీటెయిల్డ్ గా చూపించలేదు. అసలు ఎర్రచందనం అనేది ఎంత విలువైది అన్న సంగతి కూడా జనానికి అంతగా తెలియదు. పుష్ఫ సినిమాతో ఆ స్మగ్లింగ్ వెనుక ఎన్నో తెలియని విషయాల్ని, సిండికేట్ అంటే ఏంటి? దానికి ఎలాంటి వారి సపోర్ట్ ఉంటుంది? ఈ దందాని నడిపించేది ఎవరు? అనే విషయాల్ని చాలా డీప్ గా చెప్పే ప్రయత్నం చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో ఆ విషయాల్ని ఎలివేట్ చేస్తూనే.. లవ్, మదర్ సెంటిమెంట్ ను అద్భుతంగా క్యారీ చేశారు. రొటీన్ మాస్ మసాలా సినిమాలు చూసిన ఫీలింగ్ ఎక్కడా కలగకుండా.. ఓ సరికొత్త కథాకథనాల్ని దీనికోసం రాసుకున్నాడు. భారీ పోరాట సన్నివేశాల నడుమ, ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కూడా మెప్పించే ప్రయత్నం చేశారు.  అలాగే.. ఇందులోని ఒకో పాత్రను  ఎంతో శ్రద్ధగా డిజైన్ చేసి వారిచేత అద్భుతమైన నటనని రాబట్టారు. ఈ సినిమాకి రెండో బాగం ఉంది కాబట్టి.. మొదటి భాగంలో వచ్చిన పాత్రలన్నీ పరిచయంలాగానే అనిపిస్తాయి. అలాగే... ఆ పాత్రల తీరు తెన్నులు ఏంటన్నది కూడా  తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఓ కేరక్టర్ డ్రివెన్ ప్లాట్ కాబట్టి.. కథగా చెప్పడం కుదరదు. ఈవెంట్స్ లాంటి సీన్స్ తో కథ నడుస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు కాబట్టి.. కథనమంతా ఒక భాగంలో చెప్పడం కుదరదు. మొదటి భాగం ముగింపులో ఓ చిన్న అసంతృప్తి ఉంటుంది. కానీ అప్పటి వరకూ సినిమాను ఎంత ఆసక్తికరంగా తీశారన్నది ముఖ్యం. ఈ విషయంలో సుకుమార్ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. ఎక్కడికక్కడ మాస్ ఎలిమెంట్స్ కథని ఇంట్రెస్టింగ్ గా కదం తొక్కించారు. నెగెటివ్ కేరక్టర్స్ ను కూడా ఓ కొత్త కోణంలో ఆవిష్కరించారు.


పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ఒన్ మేన్ షో చేశాడు. రాయలసీమ డిక్షన్, పుష్పరాజ్ గా అతడి పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగుతుంది. ఇంతకు ముందు అల్లు అర్జున్ ను ఇలాంటి పాత్రలో చూసి ఉండని అభిమానులకి ఈ సినిమా .. ప్రీరిలీజ్ ఈవెంట్ లో  సునీల్ అన్నట్టు నిజంగా పెళ్ళి తర్వాత వచ్చే రిసెప్షన్ భోజనం లాంటిదే అనిపిస్తుంది. పుష్పరాజ్  బాధాకరమైన గతం ప్రేక్షకుల్ని వెంటాడుతుంది. దాని వల్ల ఆ పాత్రకు ఎంతటి తెగింపు ఉంటుందో అర్ధమవుతుంది. ఈ పాయింట్ కన్వి్న్సింగ్ గా అనిపిస్తుంది. అలాగే శ్రీవల్లిగా రష్మికా మందణ్ణ నటన చాలా సహజంగా ఉంటుంది. పాటల్లో ఆమె ఎనర్జీ, గ్లామర్ మెప్పిస్తాయి. మంగళం శ్రీను గా సునీల్ ది నెవర్ బిఫోర్ పాత్ర.. మళ్లీ అలాంటి పాత్ర వస్తుందో రాదో చెప్పలేం. అలాగే.. అతడి భార్య దాక్షాయణిగా అనసూయ పాత్రని  చాలా రా  అండ్ బోల్డ్ గా డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ సమంత అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతకు ముందెన్నడూ ఆ స్థాయిలో ఆమె గ్లామర్ ఒలికించలేదు. ఊ అంటావా మావా ఊఊ అంటావా అంటూ అనే పాటలో ఆమె డ్యాన్స్ అద్భుతమని చెప్పాలి.  ఇక ప్రీ క్లైమాక్స్ లో మెరుపులా కనిపించే ఫహద్ ఫాజిల్ పాత్ర కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. నిజానికి అతడి పాత్రతోనే అసలు కథ ప్రారంభం అని చెప్పాలి. రెండో భాగంలో ఫహద్ ఫాజిల్ , అల్లు అర్జున్ పాత్రల మధ్య రసవత్తరమైన సన్నివేశాలుంటాయని సుకుమార్  క్లైమాక్స్ లో చెప్పకనే చెప్పాడు. ఇక ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో ఎక్స్పెరిమెంటల్ గా మ్యూజిక్ అందించారు దేవీ. పాటల్లో అయితే ఆయన టాలెంట్ చెప్పనే అక్కర్లేదు.  అలాగే ఈ సినిమా సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరింది. విదేశీ ఛాయాగ్రహకుడు మిరాస్లావ్ క్యూబా బ్రోజెక్ అత్భుతమైన కెమేరా పనితనంతో పుష్పని విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరించాడు. పుష్ప,  శ్రీవల్లిల పెళ్ళితో మొదటి భాగాన్ని ముగించడం బాగుంది. మొత్తం మీద ‘పుష్ప’ సినిమా మాస్ ప్రేక్షకులు పండగ చేసుకొనే స్థాయిలో ఆకట్టుకుంటుందని చెప్పాలి. పుష్ప రెండో భాగం ఎలా ఉండబోతోందనే ఆసక్తినైతే క్రియేట్ చేశారు. 


ట్యాగ్ లైన్ : ఇది రైజ్ మాత్రమే.. రూల్ కోసం ఎదురుచూడాలి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement