పుష్కరిణి ప్రక్షాళన!

ABN , First Publish Date - 2022-07-05T07:07:22+05:30 IST

వరాహ నారసింహుడు కొలువుదీరిన పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం కొండదిగువన గల వరాహ పుష్కరిణిని ప్రక్షాళన చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

పుష్కరిణి ప్రక్షాళన!
వరాహ పుష్కరిణి

అభివృద్ధికి దేవస్థానం అధికారుల యత్నాలు

నిధుల కోసం కేంద్రానికి నివేదన 


సింహాచలం, జూలై 4: వరాహ నారసింహుడు కొలువుదీరిన పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం కొండదిగువన గల వరాహ పుష్కరిణిని ప్రక్షాళన చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. భక్తులు పవిత్రంగా భావించే ఈ పుష్కరిణిలో ఇటీవల ముగ్గురు మృత్యువాత పడడం, పుష్కరిణిలో నీరంతా కలుషితం కావడంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పరిధిలోని నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది. చెరువులు, జలధారల వివరాలతో నివేదిక పంపాలని ఆయా రాష్ట్రాల దేవదాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సింహాచలం వరాహ పుష్కరిణి స్థితిగతులు, పుర్వాపరాలపై అధికారులు సమగ్ర నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. 


కాలుష్య కాసారంలా పుష్కరిణి 

సింహాచలం గ్రామానికి శివారున సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో వరాహ పుష్కరిణి ఉంది. దీనికి సింహగిరిపై కురిసిన వర్షం నీరే ప్రధాన వనరు. గతంలో పుష్కరిణిలో నీటిని దిగువకు విడిచిపెట్టి, వర్షాకాలంలో కురిసే కొత్తనీటితో నింపే అవకాశం ఉండేది. ఈ నీటిని దిగువన వున్న ఆయకట్టు రైతులు వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే పట్టణీకరణ ప్రభావంతో ఆయకట్టు కనుమరుగైపోవడం, పుష్కరిణి నుంచి నీటిని బయటకు పంపే మార్గాన్ని దేవస్థానం అధికారులు మూసివేయడంతో సమస్య ప్రారంభమయింది. దీంతో నీరు నిల్వ ఉండి, తామర, తదితర మొక్కలు పెరిగిపోయాయి. పరిసర ప్రాంత వాసులు పుష్కరిణి గట్లను చెత్త వేసేందుకు వినియోగిస్తుండడం, స్నానాలు చేసే ప్రాంతంలో విపరీతంగా నాచు పేరుకుపోవడంతో భక్తులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పరిశుభ్రతకు, అభివృద్ధికి అధికారులు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులను సంప్రతించడంతో ఇంజనీరింగ్‌ విభాగం ఆచార్యులు వజీర్‌ మహ్మద్‌ పుష్కరిణిని పరిశీలించారు. ఇస్రోకు చెందిన శాస్త్రవేత్త మృత్యుంజయరెడ్డితో కూడా పుష్కరిణి అభివృద్ధి అంశంపై చర్చించడంతో ఆయన ఈ నెలలో అధ్యయనానికి రానున్నారు. 


ఇవీ అభివృద్ధి ప్రతిపాదనలు 

ఈ ప్రయత్నాలతోపాటు రూ.5 కోట్లతో పుష్కరిణి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు కేంద్ర సహకారం కోరేందుకు యత్నిస్తున్నారు. పుష్కరిణిలో నీటిని శుభ్రపరచడం, గట్లను అభివృద్ధి చేయడం, స్వాగత ద్వారాల ఏర్పాటు, అనాదిగా గ్రామస్థులు నిర్వహిస్తున్న శ్రాద్ధకర్మలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు, నీరు బయటకుపోయే మార్గాన్ని ఏర్పాటు చేయడం వంటి పనులను ప్రతిపాదించారు. అంతేకాకుండా పుష్కరిణి చుట్టూ పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకం కింద పుష్కరిణిని అభివృద్ధి చేయాలని తొలుత దేవస్థానం అధికారులు ప్రయత్నించినప్పటికీ, దీనికి పర్యాటక శాఖ అధికారులు ససేమిరా అనడంతో మరో మార్గంలో నిధుల కోసం యత్నిస్తున్నారు.  

Updated Date - 2022-07-05T07:07:22+05:30 IST