కాలువను కప్పేశారు!

ABN , First Publish Date - 2020-06-04T09:20:00+05:30 IST

అక్రమాలకు కాదేదీ అనర్హం. అక్రమార్కులు తలచుకుంటే ఖాళీ స్థలాలు.. కొండలే కాదు.. కాలువలను సైతం కప్పేస్తారు.

కాలువను కప్పేశారు!

రూ.10 కోట్ల విలువైన 6.56 ఎకరాలు కబ్జా

పురుషోత్తపురం ఎర్రచెరువుకు పొంచి ఉన్న నీటిగండం

 పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం


పలాస, జూన్‌ 3 : అక్రమాలకు కాదేదీ అనర్హం. అక్రమార్కులు తలచుకుంటే ఖాళీ స్థలాలు.. కొండలే కాదు.. కాలువలను సైతం కప్పేస్తారు. ఇందుకు పలాస-కాశీబుగ్గలో కాలువ ఆక్రమణే ఉదాహరణ. రూ.10కోట్ల విలువ చేసే.. 6.56 ఎకరాల కాలువను అక్రమార్కులు పూర్తిగా కప్పేశారు. రియల్‌ ఎస్టేట్స్‌గా మార్చేసి.. యథేచ్ఛగా ప్లాట్లు విక్రయించేస్తున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కుల తీరుతో తమకు నీటి గండం పొంచి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో భూమి  ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొండలు, గుట్టలు, గట్లు, కాలువలు మొత్తం అంతా ఆక్రమణకు గురై.. రియల్‌ భూములుగా మారుతున్నాయి. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాలకు ఆభరణాలుగా ఉన్న సూదికొండ-నెమలికొండ మధ్య నుంచి ఒకటిన్న కిలోమీటర్ల పొడవున భారీ కాలువ ఉండేది. ఈ కాలువ గుండా కొండలపై కురిసే వర్షం నీరు నేరుగా పురుషోత్తపురం వద్ద ఉన్న ఎర్రచెరువులోకి చేరి.. అక్కడి నుంచి సుమారు 100 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందుతుండేది.


సర్వేనెంబర్లు 26, 28, 34, 35లో మొత్తం ఈ కాలువ విస్తీర్ణం 6.56 ఎకరాలు. ఈ కాలువలో గతంలో పురుషోత్తపురం కాలనీకి చెందిన ఓ మహిళకు 80 సెంట్లు భూమి ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. మిగిలిన భూమంతా కొండవాగు పోరంబోకు భూమిలో రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం రికార్డుల్లోనే తప్ప.. ఒక్క సెంటు భూమి కూడా కనిపించకుండా పోయింది. కనీసం కాలువ ఆనవాళ్లు కూడా లేవు. బదిలీల వేళ.. అధికారులు మారుతున్న సమయంలో ఒక్కో ఎకరా ఆక్రమణకు గురైంది. అవన్నీ రియల్‌ భూములుగా మారిపోయాయి.  ప్రస్తుతం ఇక్కడ సెంటు రూ.3లక్షల వరకు పలుకుతోంది. కొనుగోలుదారుల డిమాండ్లు బట్టి ధర మార్పిడి చేసి పక్కాగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. పక్క సర్వే నెంబర్లు వేసి.. కొండపోరంబోకు భూములను సైతం రిజిస్ర్టేషన్లు చేసేస్తున్నారు. పోరంబోకు భూములకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని మునిసిపల్‌ అధికారులు సర్వేనెంబర్లుతో సహా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు.


కానీ, సర్వేనెంబర్లు మార్పిడి కారణంగా పక్కాగా రిజిస్ట్రేషన్లు చేస్తుండడం విశేషం. డీపట్టా భూములు కొనుగోలు చేసుకొని ఇళ్ల స్థలాలుగా పేదలకు ఇస్తున్న అధికారులు.. ఇటువంటి విలువైన భూములు సేకరించి ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం మిగలడంతో పాటు ఆక్రమణలకు కూడా అడ్డుకట్టు వేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండ వాగు పోరంబోకు భూములను పరిరక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ మధుసూధనరావు వద్ద ప్రస్తావించగా.. ఆక్రమణ విషయం తన దృష్టికి రాలేదన్నారు. ‘కరోనా’ వెసులుబాటు తరువాత సూదికొండ-నెమలికొండ మధ్య ఉన్న వాగుపై దృష్టి సారించడంతో పాటు విలువైన భూములు పరిరక్షిస్తామని తెలిపారు.  

Updated Date - 2020-06-04T09:20:00+05:30 IST