Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పర్యావరణ హిత ప్రగతి సాధన

twitter-iconwatsapp-iconfb-icon
పర్యావరణ హిత ప్రగతి సాధన

వాతావరణ మార్పు మానవాళి మనుగడకు ముప్పుగా వాటిల్లిందని మనకు తెలుసు. అయితే కాలుష్యకారక వాయువుల ఉద్గారాలను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందనే వాస్తవాన్ని మనం నిరాకరిస్తూ వస్తున్నాం. అందునా కోట్లాది ప్రజలకు అభివృద్ధి హక్కు ఆవశ్యకత ఉన్న విషమ తరుణంలో మనం అలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమే. సమాజం అంచుల్లో జీవిస్తున్న నిరుపేదలు వాతావరణ వైపరీత్యాలతో అన్ని విధాల తల్లడిల్లిపోతున్నారు. వాతావరణ మార్పు ప్రథమ బాధితులు ఆ అభాగ్యులే. వాతావరణంలో హరిత గృహ వాయువులు ప్రమాదకరంగా పేరుకుపోవడంలో వారి పాత్ర అతి స్వల్పమనే వాస్తవాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. వాతావరణ న్యాయం తప్పనిసరి అని మనం గుర్తించి తీరాలి. వాతావరణంలోకి ప్రవేశించిన బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌డై ఆక్సైడ్ –సిఓ2) సుదీర్ఘకాలం నిల్వ ఉంటుంది. గతంలో ఉద్గారమైన ఆ వాయువు సంచితమై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతోంది. తద్వారా ప్రపంచ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను నిర్వహించుకుంటున్న తీరు తెన్నులతో సిఓ2 ముడివడి ఉంది. ఆర్థికాభివృద్ధి సాధనలో మనం ఇప్పటికీ శిలాజ ఇంధనాలు (బొగ్గు, సహజ వాయువు)ను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాము. అభివృద్ధిని సాధిస్తున్నామనడంలో సందేహం లేదు. అయితే ఆ అభివృద్ధి ప్రయోజనాలు సమస్త ప్రజలకూ అందుతున్నాయా అన్నది సందేహాస్పదమే.


మరి పేదలు అత్యధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు చేయవలసిన దేమిటి? శిలాజ ఇంధనాల వినియోగంపైనే ఈ దేశాల పురోగతి ఆధారపడి ఉన్నది. ఇదే, మానవాళి మనుగడకు ముప్పు కలిగిస్తోన్న వాతావరణ వైపరీత్యాలు మరింత విషమించేలా చేస్తోంది. కర్బన ఉద్గారాలు తక్కువగా జరిగే ఆర్థికాభివృద్ధి నమూనాను పునరావిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే విధంగా పేద దేశాలను ఒత్తిడి చేస్తే సరిపోదు. దానివల్ల సత్ఫలితాలు సమకూరక పోగా అసలు లక్ష్య సాధనలో తీవ్ర జాప్యం జరిగే అవకాశముంది.


వాతావరణ మార్పును అరికట్టడానికి సంబంధించిన అంతర్జాతీయ చర్చల్లో వాతావరణ న్యాయం భావన (వాతావరణ మార్పు నష్టాలను అందరూ సమానంగా పంచుకోవడం, ఆ నష్టాలను అరికట్టేందుకు అందరూ బాధ్యత వహించడం)ను నీరు గార్చివేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పారిస్ ఒడంబడిక–2015 అయితే చారిత్రక ఉద్గారాల భావనకు స్వస్తి చెప్పింది. అలాగే వాతావరణ న్యాయం భావనకు స్వల్ప ప్రాధాన్యమిచ్చింది. వాతావరణ మార్పు ఫలితంగా సంభవిస్తున్న నష్టాలకు ‘పరిహారం’ చెల్లించడం అనే భావనకు కూడా తిలోదకాలు ఇచ్చింది. వాతావరణ మార్పులను అరికట్టడానికి సంబంధించి ఒక బలహీన, అర్థరహిత కార్యాచరణ చట్రాన్ని సృష్టించడం మరింత ఘోరమైన విషయం. కర్బన ఉద్గారాలను ఏ మేరకు తగ్గించాలనేది వివిధ దేశాలకు వివిధ పరిమాణాల్లో నిర్దేశించింది. ఒక నిర్దిష్ట దేశం ఏ స్థాయిలో కాలుష్యకారక ఉద్గారాలకు కారణమవుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వాతావరణ మార్పుకు ఎక్కువగా కారణమవుతున్న సంపన్న దేశాలు ఉద్గారాల తగ్గింపులో న్యాయమైన రీతిలో వ్యవహరించడం లేదు. 2050 సంవత్సరంనాటికి కర్బన ఉద్గారాల తగ్గింపులో నికర శూన్య (నెట్ జీరో) స్థాయిని సాధించాలనేది లక్ష్యంగా ఉన్నది. అయితే తొలుత 2030 సంవత్సరం నాటికి గణనీయమైన స్థాయిలో కర్బన ఉద్గారాలను తగ్గిస్తేనే 2050 నాటికి నికర శూన్య స్థాయిని సాధించడం జరుగుతుందనే వాస్తవాన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఉపేక్షిస్తున్నాయి.


‘పాత’ పారిశ్రామిక దేశాలతో పాటు చైనా 2019 నాటికి కర్బన ఉద్గారాలలో 73 శాతానికి కారణమవుతున్నాయి. నిర్దేశిత ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలతో కూడా అవి 2030 నాటికి 70 శాతానికి కారణంగా ఉంటాయి. ఈ వాస్తవాల దృష్ట్యా భావి కార్యాచరణలు వాతావరణ న్యాయ అనివార్యతను అంగీకరించి తీరాలి. అభివృద్ధి సాధనకు దాన్ని చోదకశక్తిగా ఉపయోగించుకోవాలి. ఇది జరిగితే వాతావరణ మార్పును అరికట్టడంలో నిజమైన పురోగతి సుసాధ్యమవుతుంది. ఇందుకు పేద దేశాల అభివృద్ధికి అధునాతన సాంకేతికతలు, ఆర్థిక వనరులు సమకూర్చితే అవి కాలుష్య రహిత అభివృద్ధిని సాధించగలుగుతాయి.


పేదదేశాల ఇంధన అవసరాలనే తీసుకోండి. ఆ దేశాలలో కోట్లాది మహిళలు వంటకు ఇప్పటికీ జీవ ద్రవ్యాలనే ఉపయోగించడం పరిపాటి. దీనివల్ల అడవుల నష్టంతో పాటు వారి ఆరోగ్యానికీ హాని జరుగుతోంది. మరి మార్గాంతరమేమిటి? వారు తమ ఇంధన అవసరాలకు కాలుష్య రహిత పునరుద్ధరణీయ ఇంధనాలను ఉపయోగించుకోవడమే. అయితే అవి వారి ఆర్థిక స్తోమతకు అందుబాటులో లేవు.. శిలాజ ఇంధనాలను ఉపయోగించుకోవడం తప్పనిసరి. కనుక ఇంధన వినియోగంలో పెను మార్పుల గురించి ఉపదేశించడానికి బదులు పునరుద్ధరణీయ ఇంధనాలు వారికి అందుబాటులో ఉండేలా చేయాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే అందుకు అవసరమైన ఆర్థిక వనరులను పేద దేశాలకు సంపన్న దేశాలు సమృద్ధంగా సమకూర్చాలి.


పారిస్ ఒడంబడికలోని మార్కెట్ల నిబంధనకు సంబంధించిన నిర్ణయాలను అమలుపరచాలి. ఇందుకు గతంలో జటిలమైన ‘క్లీన్ డెవెలప్ మెంట్ మెకానిజం’ (‍సిడిఎమ్) పద్ధతులను అనుసరించారు. అవి సరైన ఫలితాలను ఇవ్వలేదు కనుక వాటిని మళ్లీ అనుమతించకూడదు. అందుకు బదులుగా పరివర్తనాత్మక కార్యాచరణకు మార్కెట్ సాధనాలను ఉపయోగించుకున్నప్పుడే కర్బన ఉద్గారాల తగ్గింపులో గణనీయమైన పురోగతి సుసాధ్యమవుతుంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజలకు లక్షలాది మినీ–గ్రిడ్‌ల ద్వారా స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫరా చేయాలన్న నిబంధనను పటిష్ఠంగా అమలుపరచాలి. ప్రకృతి ఆధారిత పరిష్కారాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అడవులు కార్బన్‌డై ఆక్సైడ్‌ను అదుపులో ఉంచుతాయి కనుక పేద దేశాల సమృద్ధ పర్యావరణ వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. ఇందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించడంలో అడవులు అసంఖ్యాక పేదలకు జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్నాయనే వాస్తవాన్ని విస్మరించకూడదు.


కాలుష్యకారక వాయువులను నిరోధించేందుకు ‘అధునాతన’ పద్ధతులను కనుగొనాలనే ఆరాటంలో మనం ఇప్పటికే చాలా విలువైన సమయాన్ని వ్యర్థం చేశాము. పరస్పరాధారిత ప్రపంచంలో నివశిస్తున్నామనే అవగాహనతో వాతావరణ మార్పు నిరోధక విధానాలను రూపొందించుకోవాలి. వాటి అమలుకు పరస్పర సహకారం తప్పనిసరి. వాతావరణ మార్పు ఒక పెద్ద సవాల్, దానిని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మానవాళి మనుగడకు భద్రత చేకూరుతుంది.

పర్యావరణ హిత ప్రగతి సాధన

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.