వెంబడించి.. అడ్డగించి

ABN , First Publish Date - 2022-07-26T05:00:36+05:30 IST

నిఘాకు చిక్కకుండా గంజాయిని గమ్యానికి చేర్చాలనుకున్న రవాణాదారుల ప్రణాళికను పోలీసులు ఛేదించారు. కార్లను తనిఖీ చేసేందుకు సహకరించకుండా ముందుకు దూసుకెళ్లిన వారిని పోలీసులు వెంబడించి అడ్డగించారు.

వెంబడించి.. అడ్డగించి
కారు డిక్కీలో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లు


300 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు
అదుపులో ముగ్గురు నిందితులు
రెండు కార్లు సీజ్‌
రామభద్రపురం, జూలై 25:
నిఘాకు చిక్కకుండా గంజాయిని గమ్యానికి చేర్చాలనుకున్న రవాణాదారుల  ప్రణాళికను పోలీసులు ఛేదించారు. కార్లను తనిఖీ చేసేందుకు సహకరించకుండా ముందుకు దూసుకెళ్లిన వారిని పోలీసులు వెంబడించి అడ్డగించారు. రామభద్రపురం పోలీసుస్టేషన్‌ వద్ద సోమవారం ఉదయం ముగ్గురిని అదుపులోకి తీసుకుని,  300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లను సీజ్‌ చేశారు.
ఒడిశా రాష్ట్రం పాడువా నుంచి గంజాయి వస్తున్నట్లు పోలీసులకు సోమవారం ఉదయం సమాచారం అందింది. విశాఖపట్టణం తరలిస్తున్నారని తెలిసింది. పట్టుకునేందుకు నిఘా పెట్టిన పోలీసులు పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన రెండు కార్లను ఆపారు. రవాణాదారులు స్పీడ్‌గా ముందుకెళ్లడంతో అక్కడి పోలీసులు రామభద్రపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ కృష్ణమూర్తి, పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డంగా పెట్టి  ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ రెండు కార్లను అడ్డుకొని తనిఖీ చేశారు. గంజాయి ఉన్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులను(ఇద్దరు డ్రైవర్లు, మరోవ్యక్తి) అదుపులోకి తీసుకున్నారు.  140 ప్యాకెట్లుగా ఉన్న సుమారు 300 కేజీల వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు వెళ్లడిస్తామని పోలీసులు తెలిపారు.  దాడుల్లో హెచ్‌సీ వీఎల్‌వీ నారాయణ, పీసీలు మట్టయ్య, సత్యనారాయణ, నారాయణరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-26T05:00:36+05:30 IST