రామకుప్పం, మే 28: రామకుప్పంలో ప్రభుత్వం అందించే శుద్ధజలం ధరలు రెట్టింపయ్యాయి. మండల కేంద్రంలో గత ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో శుద్ధజలం ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మూడేళ్ళుగా రెండు ప్లాంట్లలో శుద్ధజలం సరఫరా ఆగిపోయింది. కేవలం దిగువ మసీదు వద్ద ఉన్న ప్లాంట్ ద్వారా మాత్రమే శుద్ధజలం సరఫరా అవుతోంది. పొరుగు గ్రామాల ప్రజలు శుద్ధజలం కావాలంటే రామకుప్పం రావాల్సిందే. ఆ ప్లాంట్‌లో తరచూ నీరు అయిపోయి ప్రజలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద శుద్దజలాన్ని అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదిలా వుండగా ప్రభుత్వ శుద్ధజలం ప్లాంట్లలో ప్రారంభం నుంచి రూ.2కే 25లీటర్ల శుద్ధజలం అందించేవారు. కానీ వారం రోజులుగా 25లీటర్ల శుద్ధజలం పట్టుకుంటే కార్డు నుంచి రూ.5 కట్ అవుతోంది. పెంచిన ధరలు తగ్గించి, మండల కేంద్రంలోని మిగిలిన రెండు ప్లాంట్లను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.