పరిశుభ్రతలో శుద్ధిపేట కావాలి

ABN , First Publish Date - 2022-05-29T04:42:26+05:30 IST

స్వచ్ఛ వార్డులుగా ఎంపికైతే వృద్ధులుకు కంటి శస్త్రచికిత్స, కీలు మార్పిడి ఉచితంగా చేయిస్తామని, రుతు ప్రేమ కార్యాక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

పరిశుభ్రతలో శుద్ధిపేట కావాలి
సిద్దిపేట మున్సిపల్‌ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు 


సిద్దిపేట టౌన్‌, మే 28: స్వచ్ఛ వార్డులుగా ఎంపికైతే వృద్ధులుకు కంటి శస్త్రచికిత్స, కీలు మార్పిడి ఉచితంగా చేయిస్తామని, రుతు ప్రేమ కార్యాక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శనివారం సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజులరాజనర్సు, వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లతో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. పట్టణంలోని 43 వార్డుల్లో స్వచ్ఛతలో భాగస్వాములై సుందరమైన సిద్దిపేటగా, పరిశుభ్రతలో శుద్ధిపేటగా నిలపాలని కౌన్సిలర్లకు సూచించారు. పట్టణంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం పూర్తయినా పలుచోట్ల ఇంకా పూర్తికాని కనెక్షన్లను కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పన్ను వసూలు చేసి, తాడిపత్రి మున్సిపాలిటీ తరహాలో మిగులు బడ్జెట్‌ ఉండేలా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట పట్టణ తాగునీటి కోసం ప్రతీనెల రూ.80 లక్షల కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 


స్వచ్ఛబడిపై దృష్టి సారించాలి


స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా స్వచ్ఛబడులను నాలుగుచోట్ల ఏర్పాటు చేశామని, వాటిపై అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధికారులు, మున్సిపల్‌ పాలకవర్గాలు వచ్చి చూస్తారని, సిద్దిపేట కీర్తి, ప్రతిష్టలు తగ్గేలా ఎవరూ వ్యవహరించవద్దని సూచించారు. స్వచ్ఛబడిలో తయారుచేస్తున్న ఎరువును విక్రయించి మున్సిపల్‌కు ఆదాయం పేరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. డ్రై వేస్టేజీ నిర్మాణం కోసం ఎకరపైగా స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్‌కు సూచించారు. డ్రై వేస్టేజీ నిర్మాణం కోసం రూ.కోటి మంజూరు చేస్లున్నట్లు చెప్పారు. ఆ నిర్మాణంపై పర్యావరణవేత్త డాక్టర్‌ శాంతి పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. రోజుకూ పట్టణంలో 12.5టన్నులు రావాల్సిన చోట కేవలం టన్నుల పొడిచెత్త వస్తున్న దృష్ట్యా.. డీఆర్సీసీలోనే పొడి చెత్త సెగ్రిగేషన్‌ జరగాలని మంత్రి సూచించారు. వీలైతే బెంగళూరుకు వెళ్లి చూసి వచ్చి సిద్దిపేటలో అమలు చేయాలని సూచించారు. బుస్సాపూర్‌ డంపింగ్‌ యార్డుకు కేవలం తడిచెత్త మాత్రమే పోయేలా చూడాలని ఆదేశించారు. బ్లాక్‌ స్పాట్లలో చెత్త వేసిన వారికి తప్పనిసరిగా జరిమానా విధించాలని ఆదేశించారు. పట్టణంలోని 88 బ్లాక్‌ స్పాట్లలో సీసీ కెమెరాలను బిగించి పోలీసు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 


టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై ఆగ్రహం


సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో కొందరు పనితీరు బాగోలేదని వారి ధోరణిను మార్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పట్టణంలో భవనాలను సెట్‌ బ్యాక్‌ లేకుండా నిర్మిస్తున్నా కొందరు అధికారులు పైసలు వసూలు చేస్తూ చర్యలు తీసుకుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఇతర విభాగాలకు బదిలీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ముజామిల్‌ఖాన్‌కు సూచించారు.


కష్టపడితే సంతోషంగా బతకొచ్చు


గజ్వేల్‌, మే 28: మూడు నెలలు కష్టపడితే జీవితాంతం సంతోషంగా బతుకొచ్చని గజ్వేల్‌ పట్టణంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన 60 మందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్‌ ఉద్యోగార్థులు గ్రంథాలయ మొబైల్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే రాష్ట్ర, జాతీయ ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగ-జాబ్‌ నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు. ఆయనవెంట సీపీ శ్వేత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-05-29T04:42:26+05:30 IST