Abn logo
Oct 10 2020 @ 14:16PM

బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్

బొటన వేలు అభివృద్ధి చెందడం వల్లే మానవ జాతి ఎన్నో సాధించిందని అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో ఆయన తరచుగా వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `బొటన వేలు` గురించి మాట్లాడారు. 


`మానవ పురోగతిలో జరిగిన గొప్ప మార్పు బొటన వేలు అభివృద్ధి జరగడం. అన్ని జంతువులకు ఐదు వేళ్లు ఉంటాయి. అయితే వాటితో పోలిస్తే మనిషి బొటన వేలు చాలా బలంగా ఉంటుంది. అలా బలంగా మారడానికి చాలా వేల సంవత్సరాలు పట్టింది. ఒక రాయిని తీసి విసరడానికి నాలుగు వేళ్లు సరిపోతాయి. కానీ, దానిని గురి చూసి విసరాలంటే బొటన వేలు కావాలి. ఒక్క బొటన వేలి కారణంగా ఎన్నో పనులు చేయ్యొచ్చు. కొన్ని వేల సంవత్సరాలు మనిషి ఎంతో కష్టపడి బొటన వేలిని బలంగా మార్చుకున్నాడు. బొటన వేలి వల్ల మానవుడు ఎంతగానో అభివృద్ధి చెందాడు. ఎన్నో కొత్తవి కనిపెట్టాడు. ఒక్క బొటన వేలితో మానవ జాతి మారిపోయింది. ఈ ప్రపంచం వాడి సొంతమైంది. మిగతావి జంతువులట. వీడు మనిషట. వీడి కోసమే దేవుడు పుట్టాడట. వీడి కోసమే స్వర్గం, నరకం ఉన్నాయట. వేరే జంతువు దేనికైనా బొటన వేలు బలంగా ఉండి ఉంటే అవే రాజ్యమేలేవి. మనిషి జీవితం దుర్భరంగా ఉండేది. కానీ, ఒక్క బొటన వేలు మొత్తం మార్చేసింది. మీ బొటన వేలు లేదనుకుని ఈ రోజు అన్నం తినడానికి ప్రయత్నించండి. మీలో ఓ జంతువు కనిపిస్తుంద`ని పూరీ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement