అమ్మాయిలెప్పుడూ కలల్లో బతుకుతారని, వాస్తవానికి దూరంగా భ్రమల్లో ఉంటారని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. `పూరీ మ్యూజింగ్స్` పేరుతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా అమ్మాయిల గురించి మాట్లాడారు.
`అమ్మాయిలెప్పుడూ కలల్లో బతుకుతారు. వాస్తవానికి దూరంగా భ్రమల్లో ఉంటారు. క్లియోపాత్రలా ఫీలవుతారు. నిజానికి వాళ్లు చాలా లాజికల్‌గా ఆలోచిస్తారు. బాగా ప్రేమిస్తారు. ఎదుటి మనిషిని బాగా అంచనా వేస్తారు.. ఇలా అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ, పొగడ్తలకు పడిపోతారు. వాటి కోసం అనుక్షణం వెయిట్ చేస్తుంటారు. అబ్బాయిలు పక్కింటి అమ్మాయిలతో అడ్జెస్ట్ అవుతారు. కానీ, అమ్మాయిలకు పక్కింటి అబ్బాయిలు సరిపోరు. సినిమా హీరోలు కావాలి. వారికి సిక్స్‌ప్యాక్ ఉండాలి. ఆరడుగులు ఉండాలి. మీరు సిక్స్‌ప్యాక్ ఉన్నవాడిని చేసుకున్నా ఆరు నెలలు తిరగకముందే వాడికి పొట్ట వస్తుంది. ఈ కాలం అమ్మాయిలకు నేను చెప్పేదేంటంటే.. స్టైల్ కంటే సౌకర్యంగా ఉండే బట్టలే వేసుకోండి. హీల్స్, లిప్‌స్టిక్‌లను పక్కనపెట్టండి. మిమ్మల్ని మీరు ఐటెమ్ గాళ్‌గా ప్రదర్శించడం ఆపండి. కెరీర్ మీద, చదువు మీద దృష్టి పెట్టి శక్తివంతమైన మహిళగా మారండి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. కొంచెం మంచోడు, తన పని తను చేసుకోయేవాడిని పెళ్లి చేసుకోండి. నువ్వు రాకుమారివి కాదు.. మనకి మాహిష్మతి సామ్రాజ్యం వద్దు.. బాహుబలి అసలే వద్ద`ని పూరీ పేర్కొన్నారు.