Oct 28 2021 @ 19:09PM

నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు: పూరి

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 29న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘‘ఇంటెన్స్ లవ్ స్టోరి సినిమా చూసి చాలా రోజులైంది. సినిమా చాలా బాగుంది. మూడేళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూడటం చాలా బాగుంది. ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు. ఈ సినిమాకు ఈ లైనే ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకాష్ మంచి నటుడు అని రాజమౌళి కూడా చెప్పారు. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్‌లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాష్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. వాడు నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు. ఇలాంటి తండ్రి అందరికీ దొరకడు. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ‌గారు కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్‌లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాష్ బాగా హోల్డ్ చేశాడు. ప్రభాస్, విజయ్.. ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’’ అని అన్నారు.