పరపతి సంఘాల ప్రక్షాళన

ABN , First Publish Date - 2022-08-04T04:17:54+05:30 IST

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ప్రక్షాళన మొదలైంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పరపతి సంఘాల  ప్రక్షాళన

  1. త్వరలో ఉద్యోగుల బదిలీలు
  2. సొసైటీలపై తగ్గనున్న నేతల ఒత్తిడి 

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 3: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ప్రక్షాళన మొదలైంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏళ్ల తరబడి ఒకే సహకార సంఘంలో పని చేయడంతో సీఈవోలు, ఇతర సిబ్బందిపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీని వల్ల భారీగా నిధుల దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బదిలీలతో ఇకపై అక్రమాలకు పుల్‌స్టాఫ్‌ పడనుంది. దీంతో పాటు ఉద్యోగుల వేతనాల కోసం ఆప్కాబ్‌, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల అజమాయిషీలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం బదిలీల కోసం సంఘాల సీఈవోలు, స్టాఫ్‌ అసిస్టెంట్ల జాబితాలను పరిశీలిస్తున్నారు. సీనియారిటీ జాబితాను కూడా తయారు చేస్తున్నారు. 

త్వరలోనే హెచఆర్‌ పాలసీ అమలు 

సీఈవోలతోపాటు ఇతర సిబ్బందికి త్వరలోనే హెచఆర్‌ పాలసీ అమలు చేయనున్నారు. జిల్లాలోని 106 సహకార సంఘాల్లో దాదాపు 250 మంది దాకా వివిధ క్యాడర్లలో పని చేస్తున్నారు. హెచఆర్‌ అమలైతే ఉద్యోగులకు పర్సనల్‌ లోన రూ.2 లక్షలు, గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స రూ.2 లక్షలు అందనుంది. హెచఆర్‌ పాలసీ అమలు కోసం ప్రతి ఉద్యోగి సర్వీసు రిజిస్టర్‌ ప్రారంభించాలని జిల్లా సహకార శాఖ అధికారి రామాంజినేయులు ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా సిబ్బందికి పే స్కూల్‌ కూడా ఖరారు కానుంది. దీనివల్ల సొసైటీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత చేకూరనున్నట్లు బ్యాంకు అధికార వర్గాలు చెబుతున్నాయి.

డీఎల్‌ఈసీ ఏర్పాటు:  

సహకార సంఘాల్లో హెచఆర్‌ పాలసీ అమలు చేయడానికి డీఎల్‌ఈసీ (డిస్ర్టిక్ట్‌ లెవల్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ) ఏర్పాటు చేశారు. కమిటీకి చైర్మనగా డీసీసీబీ చైర్‌పర్సన మహాలక్ష్మి, సభ్యులుగా నాబార్డు డీడీఎం శ్రీవాస్తవ, బ్యాంకు సీఈవో రామాంజినేయులు ఉంటారు. మూడేళ్లపాటు ఆయా సంఘాల లాభాల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు ఈ పాలసీని వర్తింపజేస్తారు. 

హెచఆర్‌ పాలసీని అమలు చేస్తాం 

జిల్లా సహకార సంఘాల్లో పని చేస్తున్న సీఈవోతోపాటు ఇతర ఉద్యోగులకు హెచఆర్‌ పాలసీని అమలు చేసేందు కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా సీనియారిటీని బట్టి బదిలీల కార్యక్రమం చేపడతాం. ఉద్యోగులకు పే ఫిక్షేషన సర్వీసు రిజిస్టర్‌, అథెంటికేషన ఉంటుంది. డీసీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన డీఎల్‌ఈసీ కమిటీ ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తుంది. సహకార సంఘాల ఉద్యోగులకు ఇకపై వేతన కష్టాలు తప్పిపోనున్నాయి. 

- రామాంజినేయులు, జిల్లా సహకార శాఖ అధికారి


Updated Date - 2022-08-04T04:17:54+05:30 IST