స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి

ABN , First Publish Date - 2021-04-16T06:24:12+05:30 IST

నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేప ట్టారు.

స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి
ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా 

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 15: నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేప ట్టారు. ఈసందర్భంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు దుర్గం మారుతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పెండ్యాల సాయికృష్ణారెడ్డి (బిట్టూ) మాట్లాడుతూ కొన్నాళ్ళుగా నగరపాలక సంస్థ నల్లాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు దుర్గంధం వెదజల్లుతోందన్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు మున్సిపల్‌ కార్యాలయానికి రాగా ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనితో తప్పనిపరిస్థితిలో కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. వేములవాడ, సిరిసిల్ల నుంచి మురుగునీరు   మిడ్‌మానేరుకు వస్తుందని, ఆ నీటిని ఎల్‌ఎండీకి వదులుతుండడంతో ఎల్‌ఎండీ నీరు కూడా డ్రైనేజీ నీటిలో కలిసి కలుషితమవుతోం దని వారు పేర్కొన్నారు.  నల్లానీటిని వేడి చేసి తాగాలని మున్సిపల్‌ అధికారులు సూచిస్తున్నారన్నారు. అయితే  నీటిని వేడిచేసినా  తాగలేని పరిస్థితి ఉందన్నారు.  వెంటనే ఫిల్టర్‌ బెడ్స్‌ వద్ద అధునాతన పరికరాలను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎన్‌.లక్ష్మణ్‌, తాడూరి బ్రహ్మం, బాసవేని మల్లేశ్‌యాదవ్‌, ఆర్‌.విద్యాసాగర్‌, ఎం.ఆనంద్‌, డి.సతీష్‌కుమార్‌, ములుగూరి కిషోర్‌, సుజాతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T06:24:12+05:30 IST