కొనుగోళ్లు సరే.. కమీషన్‌ ఏదీ?

ABN , First Publish Date - 2022-01-20T04:52:08+05:30 IST

వరి ధాన్యం కొనుగోలు ఏజెన్సీ లకు కమీషన్‌ డబ్బులు సకాలంలో అందడం లేదు. కమీషన్‌ డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లించడంలో రాష్ట్ర పౌరసరాఫరా శాఖ అధికారులు జాప్యం వహిస్తున్నారు.

కొనుగోళ్లు సరే.. కమీషన్‌ ఏదీ?
కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు(ఫైల్‌)

- ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలకు తప్పని తిప్పలు
- జిల్లాలో రూ. 25.86 కోట్ల బకాయిలు
-  మహిళా సంఘాల ఎదురుచూపు

జగిత్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోలు ఏజెన్సీ లకు కమీషన్‌ డబ్బులు సకాలంలో అందడం లేదు. కమీషన్‌ డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లించడంలో రాష్ట్ర పౌరసరాఫరా శాఖ అధికారులు జాప్యం వహిస్తున్నారు. జిల్లాలో గత చివరి రెండు సీజన్లకు కలిపి రూ. 25.86 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. జిల్లాలోని 18 మండలాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, డీఆర్‌డీఏ స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, సహకార సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేశారు. వీరికి రావాల్సిన కమీషన్‌ డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఎదురుచూపులతో గడుపుతున్నారు.

 రెండు సీజన్లకు కలిపి..
జిల్లాలోని 18 మండలాలు, 5 మున్సిపాల్టీల్లో ఏర్పాటు చేసిన వ్యవ సాయ మార్కెట్‌ కమిటీలు, డీఆర్‌డీఏ, పీఏసీఎస్‌ కేంద్రాల ద్వారా గత రెండు సీజన్లలో వరి ధాన్యం కొనుగోలు చేశారు. 2020-21 వానాకాలం సీజన్‌, 2020-21 యాసంగి సీజన్‌లలో జిల్లాలో 4,89,345 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు జరిపారు. క్వింటాలు వరి ధాన్యం కొనుగోలు చేసినందుకు గానూ ప్రభుత్వం ఏజన్సీలకు రూ. 3.25 పైసలను కమీషన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు గానూ వివిధ ఏజెన్సీలకు పౌర సరాఫరా శాఖ రూ. 25.86 కోట్ల కమీషన్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఏఎంసీలకు రూ. 66. 65 లక్షలు, డీఆర్‌డీఏకు రూ. 9.53 కోట్లు, పీఏసీఎస్‌ రూ. 15.65 కోట్లు కమీషన్‌ బకాయిలు రావాల్సి ఉంది.

వానాకాలం సీజన్‌లో..
జిల్లాలో 2020 - 21 వానాకాలం సీజన్‌లో 2,56,150 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు చేశారు. ఇందులో ఏఎంసీల ద్వారా 5,783 మెట్రిక్‌ టన్నులు, డీఆర్‌డీఏ ద్వారా 99,927 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌ ద్వారా 1,50,440 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు చేశారు. ఇందుకు గానూ ఏఎంసీలకు రూ. 18.50 లక్షలు, డీఆర్‌డీఏకు రూ. 3.19 కోట్లు, పీఏసీ ఎస్‌లకు రూ. 4.81 కోట్ల కమీషన్‌ బకాయిలు పౌర సరాఫరాల శాఖ చెల్లించాల్సి ఉంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి వివిధ కొనుగోలు ఏజెన్సీలకు కలిపి మొత్తం రూ. 8.19 కోట్లు కమీషన్‌ బకాయిలు విడుదల కావాల్సి ఉంది.

యాసంగి సీజన్‌లో..
జిల్లాలో 2020 - 21 యాసంగి సీజన్‌లో 5,52,264 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు చేశారు. ఇందులో ఏఎంసీల ద్వారా 15,091 మెట్రిక్‌ టన్నులు, డీఆర్‌డీఏ ద్వారా 1,98,208 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌ ద్వారా 3,38,905 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు జరిపారు. ఇందుకు గానూ ఏఎంసీలకు రూ. 48.15 లక్షలు, డీఆర్‌డీఏకు రూ. 6.34 కోట్లు, పీఏసీఎస్‌లకు రూ. 10.84 కోట్ల కమీషన్‌ బకాయిలు పౌరసరాఫరా శాఖ చెల్లించాల్సి ఉంది. యాసంగి సీజన్‌లో వివిధ ఏజన్సీలకు కలిపి మొత్తం రూ. 17.66 కోట్లు కమీషన్‌ బకాయిలు రావాల్సి ఉంది.

ఇబ్బందులో కొనుగోలు ఏజెన్సీలు..
వరి ధాన్యం కొనుగోలుకు సంబందించిన కమీషన్‌ డబ్బులు సకాలంలో అందక పోవడంతో ఆయా కొనుగోలు ఏజెన్సీలకు తిప్పలు తప్పడం లేదు. కమీషన్‌ డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కమీషన్‌ డబ్బులు సకాలంలో అందక పోవడంతో కొనుగోలు ఏజెన్సీల సభ్యులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వరి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేస్తున్న ప్పటికీ కమీషన్‌ డబ్బులు సకాలంలో అందకపోవడంతో  ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కమీషన్‌ డబ్బులు అందజేయాలని ఏజెన్సీల నిర్వా హకులు కోరుతున్నారు.

డబ్బులు చెల్లించాల్సి ఉంది..
- రజినీకాంత్‌, డీఎం, జిల్లా పౌరసరాఫరాల శాఖ

జిల్లాలో గత చివరి రెండు సీజన్లకు సంబంధించి వరి ధాన్యం కొను గోలు ఏజెన్సీలకు కమీషన్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇందుకు అవ సరమైన వివరాలను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే ఆయా కొనుగోలు ఏజెన్సీలకు బ్యాంకుల ద్వారా నేరు గా కమీషన్‌ డబ్బులను ఖాతాల్లో జమ చేస్తాం.

Updated Date - 2022-01-20T04:52:08+05:30 IST