అన్నదాత ఆగమాగం

ABN , First Publish Date - 2020-04-26T09:30:15+05:30 IST

వారం రోజులుగా మహబూబాబాద్‌ జిల్లాలో మక్కల కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అన్నదాతల్లో ఆందోళన

అన్నదాత ఆగమాగం

గన్నీ సంచులు, లారీల కొరత 

వారం రోజులుగా నిలిచిన మక్కల కొనుగోళ్లు

పట్టించుకోని అధికారులు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 25: వారం రోజులుగా మహబూబాబాద్‌ జిల్లాలో మక్కల కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు లారీల ఎగుమతి లేక, గన్నీ సంచుల కొరతతో మక్కల రాశులతో వం దలాది బస్తాలతో నిండిపోవడంతో ఎటు చూసినా మక్కల నిల్వలే కన్పిస్తున్నాయి. కొనుగోళ్లు నిలిచిపోయినప్పటికీ మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. ఆకాశంలో మబ్బులు చేస్తుండడంతో వర్షం ఎప్పుడు వస్తుందోనని రైతులు తీవ్ర ఆందోళన చెం దుతున్నారు.


జిల్లాలో 43,274 ఎకరాల్లో..

జిల్లాలో 43,274 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తున్నారు. అందులో 1.34 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న రాబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 64 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8,500 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలను ఖరీదు చేశారు. ప్రారంభంలోనే కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు అరకొరగా ఇచ్చిన మార్క్‌ఫెడ్‌ సంస్థ ఆ తర్వాత సంచులు లేవని చేతులెత్తేయడంతో రైతులు ఒక్కొ బస్తాకు రూ.30 చొప్పున బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గన్నీ సంచులు బయట కూడా దొరకక పోవడంతో రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. మక్కల బస్తాలు నిల్వ చేసేందుకు గోదాంలు దొరకకపోవడంతో ఈ పరిస్థితికి మరోకారణమైంది. లారీలు రాకపోవడంతో ఎగుమతి కావాల్సిన బస్తాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. మొక్కజొన్నల కాంట, లారీల్లో ఎగుమతి అయ్యే వరకు రైతులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మూడ్రోజుల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే రాత్రనకా... పగలనకా కాపలా ఉంటూ నానా యాతన పడుతున్నారు.  


లారీలు రావడం లేదు : కనంతరెడ్డి నర్సింహులరెడ్డి, పెనుగొండ రైతు

31 బస్తాల మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రానికి ఈనెల 16న తరలించాను. 17న కాంట అయి బస్తాలు కుట్టడం కూడా జరిగింది. అధికారులు కాంట అయిన బస్తాలను లారీల్లో తొలకం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే లారీలతో బస్తాలను తరలించాలి.

Updated Date - 2020-04-26T09:30:15+05:30 IST