పురపోరు బ్యాలెట్‌తోనే!

ABN , First Publish Date - 2021-02-27T04:37:18+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో ఈదఫా ఓటింగ్‌ విధానం మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) వినియోగించారు.

పురపోరు బ్యాలెట్‌తోనే!

ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈసీ

పేపర్‌ సిద్ధం చేసుకుంటున్న యంత్రాంగం

అభ్యర్థులు ఖరారయ్యాక ముద్రణ


నెల్లూరు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌ ఎన్నికల్లో ఈదఫా ఓటింగ్‌ విధానం మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) వినియోగించారు. ఈసారి మాత్రం బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి. 

పది రోజుల క్రితం మున్సిపల్‌ నోటిఫికేషన్‌ విడుదలైన సమయంలో ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఎన్నికల సంఘం నిర్ణయం మార్చడంతో ఆ మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్‌ బాక్సులను ఉపయోగించారు. ఆ బాక్సులనే మున్సిపల్‌ ఎన్నికలకు కూడా ఉపయోగించేలా ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ యంత్రాంగం తెల్ల బ్యాలెట్‌ పేపర్లను సమకూర్చుకుంటోంది. ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీలకు మార్చి 1వ తేదీలోపు బ్యాలెట్‌ పేపర్‌ను, బాక్సులను పూర్తిస్థాయిలో చేరవేయనున్నారు. గతేడాదే ఈ నాలుగు మున్సిపాలిటీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 98 వార్డులకు 531 మంది నామినేషన్లు దాఖలై ఉండగా, మార్చి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు ఖరారవుతాయి. ఆ వెంటనే బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రణ జరుగుతుంది. మార్చి 10వ తేదీన పోలింగ్‌ జరగనుండగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు అధికంగా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కాగా ఈవీఎంలు కావడంతో గత ఎన్నికల సమయంలో ఫలితాలను రెండు, మూడు గంటల్లోనే ప్రకటించారు. కానీ ఈ దఫా బ్యాలెట్‌ విధానం కావడంతో ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-02-27T04:37:18+05:30 IST