బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి

ABN , First Publish Date - 2020-09-27T08:41:12+05:30 IST

భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దగ్గుబాటి పురందేశ్వరికి దక్కింది...

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి

  • ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
  • రాంమాధవ్‌, మురళీధర్‌రావు ఔట్‌
  • అధికార ప్రతినిధి హోదా కోల్పోయిన
  • జీవీఎల్‌..  నడ్డా కొత్త కార్యవర్గం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దగ్గుబాటి పురందేశ్వరికి దక్కింది. ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు తెలుగువారు రాంమాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించి.. పురంధేశ్వరికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ నుంచి డీకే అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో నియమించారు. కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌ను అదే పదవిలో కొనసాగించాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ రాష్ట్ర శాఖ  మాజీ అఽధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో జాతీయ స్థాయిలో మళ్లీ నలుగురు తెలుగు వారికి, అందులో ఇద్దరు మహిళలకు పార్టీలో కీలక స్థానం దక్కినట్లయింది. కాగా, నిన్నటి వరకూ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావును ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా శనివారం ప్రకటించారు.


ఆ ముగ్గురి తొలగింపు అందుకే?

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో రాంమాధవ్‌, మురళీధర్‌రావును తొలగిస్తారన్న అంశంపై చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రాంమాధవ్‌ను గత కొంతకాలంగా వివిధ బాధ్యతల నుంచి తప్పిస్తూ వస్తున్నారు. ఇక మురళీధర్‌రావుపై అంతగా ఆరోపణలు లేకపోయినా.. ఆయన దాపరికం లేకుండా మాట్లాడతారనే విమర్శలు ఉన్నాయి. కాగా, జీవీఎల్‌ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తలదూర్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రధాని నరేంద్రమోదీ త్వరలో తన కేబినెట్‌ను విస్తరించనున్నట్లు, అందులో మంత్రులుగా అవకాశం కల్పించేందుకే కొందరు నేతలను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


మురళీధర్‌రావుకు మరో కీలక పదవి..!

సీనియర్‌ నేత మురళీధర్‌రావుకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో అవకాశం దక్కకపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తెలంగాణలో అధికార పార్టీ నేతలతో ఆయనకు సాన్నిహిత్యం ఉన్నట్లు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు అందడం వల్లే ఆయన పదవి రెన్యువల్‌ కాలేదన్నది ఒక వాదన కాగా,  కర్ణాటక ఉదంతం కారణమనే మరో వాదన ఉంది. కొద్ది నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేజిక్‌ మార్క్‌కు ఆరు సీట్ల దూరంలో నిలిచినా.. యడియూరప్ప ఆగమేఘాలపై సీఎం బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత బలపరీక్షకు ముందే రాజీనామా చేయాల్సి రావడం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీ కర్ణాటక ఇన్‌చార్జిగా వ్యవహరించిన మురళీధర్‌రావు వ్యూహంలో వైఫల్యం కారణంగానే పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయిందని అప్పట్లో ప్రచారం జరిగిందని బీజేపీ నేతలు తెలిపారు. అయితే మురళీధర్‌కు రాజ్యసభ సభ్యత్వం కల్పంచే అవకాశం ఉందనే ప్రచారం కూడా పార్టీలో ఉంది. ఇక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ఊహించినట్లుగానే జాతీయ పదవి దక్కింది. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు అయిందని అంటున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో  తెలంగాణకు సముచిత స్థానం కల్పించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు కృతజ్ణతలు చెబుతున్నానన్నారు. కాగా పురందేశ్వరి, సత్యకుమార్‌, సునీల్‌ దియోధర్‌కు రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు, రాంమాధవ్‌, నాగోతు రమేశ్‌ నాయుడు, జాతీయ లేబర్‌ బోర్డు చైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ, లంకా దినకర్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-09-27T08:41:12+05:30 IST