Abn logo
Apr 13 2021 @ 16:38PM

ప్రిన్స్ హ్యారీ నన్ను మోసం చేశాడు: కోర్టుకెక్కిన పంజాబ్ మహిళ

చండీగఢ్: సోషల్ మీడియా ఇప్పుడు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతోంది. ఫన్నీ కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీని అరెస్ట్ చేయాలంటూ ఓ మహిళ కోర్టుకెక్కడమే ఇందుకు కారణం. అతడు తనను వివాహం చేసుకుంటానని మాటిచ్చి తప్పాడని, కాబట్టి అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ ఓ మహిళ  పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది.


పరిశీలించిన కోర్టు విచారణార్హం కాదంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాదు, దానిని ‘పగటి కలలు కనేవారి ఊహాలోకం’గా అభివర్ణించింది. ఇక, ఈ వార్త వెలుగులోకి వచ్చాక నెటిజన్లు జోకులు, మీమ్స్‌తో సోషల్ మీడియాను కడుపుబ్బా నవ్విస్తున్నారు.  

పల్విందర్ సింగ్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసి విచారణకు స్వయంగా హాజరయ్యారు. న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ సింగ్ సంగ్వాన్ మాట్లాడుతూ.. పిటిషన్ చాలా పేలవంగా ఉందని, పిటిషనర్‌ను పెళ్లాడతానంటూ ప్రిన్స్ హ్యారీ పంపినట్టుగా కొన్ని ఈ-మెయిల్స్‌ను పేర్కొన్నారని అన్నారు. దీనిని విచారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.


నకిలీ సంభాషణను నిజమైనదిగా నమ్ముతున్న పిటిషనర్‌పై సానుభూతిని మాత్రమే చూపించగలమని కోర్టు పేర్కొంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సైట్ల నుంచి తప్పుడు ఐడీలు సృష్టించడం గురించి అందరికీ తెలిసిందేనని, సో కాల్డ్ ప్రిన్స్‌హ్యారీ పంజాబ్‌లోని ఏదో ఓ చిన్న గ్రామంలోని సైబర్ కేఫ్‌లో కూర్చుని పిటిషనర్‌కు పెళ్లి ప్రతిపాదన చేసి ఉండొచ్చన్నారు.


మహిళ పిటిషన్‌ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు ఫన్నీ ట్వీట్స్ పోస్టు చేస్తున్నారు. తనను డిస్నీల్యాండ్‌లో పెళ్లాడతానంటూ మాటతప్పిన టేలర్ స్విఫ్ట్, స్కార్లెట్ జొహాన్సన్, మార్గొట్ రోబీ, క్రిస్టెన్ స్టీవార్ట్, ఎమ్మా రోబెర్ట్స్, ఎమ్మా వాట్సన్‌లపైనా చర్యలు తీసుకోవాలని కోర్టుకెక్కుతానని ఓ యూజర్ ట్వీట్ చేశాడు.  ‘థ్యాంక్ గాడ్.. ప్రిన్స్ హ్యారీ ఎలాంటి చిక్కులు లేకుండా బయటపడ్డారు. గొప్ప ఉపశమనం’ అని మరొకరు కామెంట్ చేశారు.


తానైతే తొలుత పంజాబ్‌కు చెందిన హ్యారీ భాయ్ అనుకున్నానని ఇంకొకరు పేర్కొంటే,  ‘ప్రేమ గుడ్డిది’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. కాగా, ప్రిన్స్ హ్యారీ 2018లో నటి మేఘన్ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో వారికి కుమారుడు ఆర్చీ జన్మించాడు. త్వరలో వారు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.  

Advertisement
Advertisement