Abn logo
Apr 13 2021 @ 03:56AM

సంజూ పోరాడినా..

  • చివరి బంతికి ఓడిన రాజస్థాన్‌
  • పంజాబ్‌ ఉత్కంఠ గెలుపు


తాజా సీజన్‌లో అదిరిపోయే మ్యాచ్‌. పంజాబ్‌ విసిరిన 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో  చివరి బంతి వరకూ గెలుపెవరిదో ఊహించని  పరిస్థితి. ఒకే ఒక్కడు సంజూ శాంసన్‌ అత్యద్భుత ఆటతీరే ఈ ఉత్కంఠకు కారణం. 20 ఓవర్లపాటు అతడి పరాక్రమం అభిమానులను ఉర్రూతలూగించింది. చివరకు అర్ష్‌దీప్‌ తెలివైన బౌలింగ్‌తో కేవలం నాలుగు పరుగుల తేడాతో పంజాబ్‌ గట్టెక్కింది. రాజస్థాన్‌ నుంచి శాంసన్‌ 119 పరుగులు సాధించగా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ అత్యధిక స్కోరు 25 మాత్రమే.. అంతకుముందు రాహుల్‌, హూడా తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు భారీ స్కోరునందించారు.ముంబై: కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119) వీరోచిత పోరాటం ఫలించలేదు. తీవ్ర ఒత్తిడిని జయిస్తూ సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అదిరే బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. రాహుల్‌ (50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్‌ హూడా (28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64) గేల్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) చెలరేగారు. చేతన్‌ సకారియాకు మూడు, మోరి్‌సకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓడింది. అర్ష్‌దీ్‌ప మూడు, షమి రెండు వికెట్లు తీశారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ శాంసన్‌కు దక్కింది.


శభాష్‌ శాంసన్‌..: భారీ ఛేదనలో రాజస్థాన్‌ అద్భుత పోరాటం ప్రదర్శించింది. తొలి ఓవర్‌లోనే స్టోక్స్‌ (0),  నాలుగో ఓవర్‌లో మనన్‌ వోహ్రా (12) వికెట్లను కోల్పోయినా ఏమాత్రం చలించలేదు. 12, 35 పరుగుల వద్ద తానిచ్చిన క్యాచ్‌లను పంజాబ్‌ వదిలేయడంతో చెలరేగిన కెప్టెన్‌ శాంసన్‌ చివరి బంతి వరకు ప్రత్యర్థిని వణికించాడు. ఆరంభంలో బట్లర్‌ (25) మెరిడిత్‌ తొలి ఓవర్‌లోనే వరుసగా 4 ఫోర్లు సాధించాడు. దీంతో పవర్‌ప్లేలో ఆర్‌ఆర్‌ 59 పరుగులు సాధించింది. అయితే పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ పంజాబ్‌కు ఊరటనిస్తూ బట్లర్‌ వికెట్‌ సాధించాడు. కాసేపటికే శాంసన్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఈసారి మయాంక్‌ అందుకోలేకపోయాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ 11వ ఓవర్‌లో ఓ సిక్స్‌, ఫోర్‌ సాధించాడు. శివమ్‌ దూబే (23) విఫలమైనా పరాగ్‌ (11 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 25)తో కలిసి శాంసన్‌ జోరు పెంచాడు. 15వ ఓవర్‌లో శాంసన్‌ 4,6.. 16వ ఓవర్‌లో పరాగ్‌ 6,6 బాదడంతో ఆర్‌ఆర్‌ లక్ష్యం వైపు సాగుతున్నట్టనిపించింది. కానీ 17వ ఓవర్‌లో ఎనిమిది పరుగులే ఇచ్చిన షమి.. పరాగ్‌ వికెట్‌ సాధించాడు. దీంతో ఐదో వికెట్‌కు 22 బంతుల్లోనే 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రిచర్డ్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో శాంసన్‌ వరుసగా 4,6,4తో 19 రన్స్‌తో పాటు 54 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్‌ తొలి బంతికే తెవాటియా (2)ను మెరిడిత్‌ అవుట్‌ చేసినా శాంసన్‌ బాదుడు ఆపలేదు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా.. ఐదో బంతికి సింగిల్‌కు నిరాకరించిన శాంసన్‌, ఆఖరి బంతికి సిక్సర్‌ ప్రయత్నంలో క్యాచ్‌ అవుటయ్యాడు.రాహుల్‌-హూడా బాదుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో రాహుల్‌-హూడా ఆటతీరు హైలైట్‌గా నిలిచింది. పోటాపోటీగా సాగిన వీరి బ్యాటింగ్‌తో రాజస్థాన్‌ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (14)ను మూడో ఓవర్‌లోనే పేసర్‌ సకారియా అవుట్‌ చేయగా బరిలోకి దిగిన గేల్‌ ఉన్నంత సేపు బ్యాట్‌ ఝుళిపించాడు. రాహుల్‌తో కలిసి ఓవర్‌కో బౌండరీ ఉండేలా వేగం కనబరిచాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో 4,6 బాదిన గేల్‌ను మరుసటి ఓవర్‌లోనే యువ స్పిన్నర్‌ రియాన్‌ పరాగ్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు రాహుల్‌ మాత్రం ఓ సిక్సర్‌తో 30 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక దీపక్‌ హూడా భారీ షాట్లతో ఆర్‌ఆర్‌ బౌలర్లను వణికించాడు. 13వ ఓవర్‌లో రెండు, 14వ ఓవర్లలో మూడు సిక్సర్లు బాదడంతో పంజాబ్‌ స్కోరు 150కి చేరింది. ఇదే జోరుతో తను 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.  అలాగే 17వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించిన హూడాను తర్వాతి ఓవర్‌లోనే మోరిస్‌ అవుట్‌ చేశాడు. మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 105 పరుగులు రావడం విశేషం. అదే ఓవర్‌లో పూరన్‌ (0) క్యాచ్‌ను ఎడమవైపు డైవ్‌ చేస్తూ సకారియా అద్భుతంగా పట్టేశాడు. అప్పటికే స్కోరు 200 దాటింది. ఇక చివరి ఓవర్‌లో రాహుల్‌ క్యాచ్‌ను బౌండరీ లైన్‌ దగ్గర సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ తెవాటియా పట్టేయడంతో అతడి సెంచరీ మిస్‌ అయ్యింది. కానీ పంజాబ్‌ చివరి 5 ఓవర్లలోనే 61 పరుగులు సాధించింది.స్కోరుబోర్డు

పంజాబ్‌: రాహుల్‌ (సి) తెవాటియా (బి) సకారియా 91, మయాంక్‌ (సి) శాంసన్‌ (బి) సకారియా 14, గేల్‌ (సి) స్టోక్స్‌ (బి) పరాగ్‌ 40, హూడా (సి) పరాగ్‌ (బి) మోరిస్‌ 64, పూరన్‌ (సి) సకారియా (బి) మోరిస్‌ 0, షారుక్‌ (నాటౌట్‌) 6, రిచర్డ్‌సన్‌ (సి) మోరిస్‌ (బి) సకారియా 0, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 221/6. వికెట్ల పతనం: 1-22, 2-89, 3-194, 4-201, 5-220, 6-221. బౌలింగ్‌: సకారియా 4-0-31-3, ముస్తాఫిజుర్‌ 4-0-45-0, మోరిస్‌ 4-0-41-2, గోపాల్‌ 3-0-40-0, స్టోక్స్‌ 1-0-12-0, తెవాటియా 2-0-25-0, పరాగ్‌ 1-0-7-1, దూబే 1-0-20-0.

రాజస్థాన్‌: బెన్‌ స్టోక్స్‌ (సి అండ్‌ బి) షమి 0, మనన్‌ వోహ్రా (సి అండ్‌ బి) అర్ష్‌దీప్‌ 12, శాంసన్‌ (సి) హూడా (బి) అర్ష్‌దీప్‌ 119, బట్లర్‌ (బి) రిచర్డ్‌సన్‌ 25, శివమ్‌ దూబే (సి) హూడా (బి) అర్ష్‌దీప్‌ 23, రియాన్‌ పరాగ్‌ (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) షమి 25, రాహుల్‌ తెవాటియా (సి) కేఎల్‌ రాహుల్‌ (బి) మెరిడిత్‌ 2, మోరిస్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 217/7. వికెట్ల పతనం: 1-0. 2-25, 3-70, 4-123, 5-175, 6-201, 7-217. బౌలింగ్‌: మహ్మద్‌ షమి 4-0-33-2, రిచర్డ్‌సన్‌ 4-0-55-1, అర్ష్‌దీప్‌ 4-0-35-3, మెరిడిత్‌ 4-0-49-1, ఎం. అశ్విన్‌ 4-0-43-0.
ఐపీఎల్‌ చరిత్రలో ఎక్కువ సిక్సర్లు (351) బాదిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌


2

ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (119) సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా శాంసన్‌. అలాగే రాజస్థాన్‌ తరఫున 2 వేల పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌ అయ్యాడు.ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదిన క్రికెటర్‌గా శాంసన్‌

Advertisement
Advertisement
Advertisement