కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని పంజాబ్ ఓటర్లు తేల్చారు: ఆప్ చీఫ్

ABN , First Publish Date - 2022-03-10T23:15:03+05:30 IST

కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని పంజాబ్ ఓటర్లు తీర్పిచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ ..

కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని పంజాబ్ ఓటర్లు తేల్చారు: ఆప్ చీఫ్

న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని పంజాబ్ ఓటర్లు తీర్పిచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ ప్రజలు గర్జించి సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.


పార్టీలన్నీ తమ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యాయని, వారిందరిదీ ఒకటే లక్ష్యమని అన్నారు. పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. అందరూ ఒక్కటై కేజ్రీవాల్ ఉగ్రవాది అని ప్రచారం చేశారని, కానీ ప్రజలందరూ కలిసి కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని తీర్పు ఇచ్చారని అన్నారు. ఆయన అసలైన జాతీయవాదని, ఈ గడ్డ బిడ్డని కేజ్రీవాల్ అన్నారు. 


ఎన్నికల ప్రచారం సమయంలో కేజ్రీవాల్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్‌ అయితే కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వేర్పాటువాదులకు కేజ్రీవాల్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ‘పంజాబ్ సీఎం, లేదంటే ఖలిస్థాన్ ప్రధానమంత్రి’ కావాలనుకుంటున్నారని కుమార్ విశ్వాస్ తీవ్ర ఆరోపణలు చేశారు.


కేజ్రీవాల్ వేర్పాటువాద అనుకూలురని కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేశాయి. ప్రతిపక్షాల ఆరోపణలకు కేజ్రీవాల్ బదులిస్తూ తాను.. ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు కట్టిస్తున్న ఉగ్రవాదినని అన్నారు. అంతేకాదు, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. తాను వేర్పాటవాదులకు అనుకూలమైతే మోదీ ఎందుకు నిరూపించలేకపోయారని, ఆ ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఆరోపణలను పటాపంచలు చేస్తూ పంజాబ్ ఓటర్లు మాత్రం కేజ్రీవాల్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు.

Updated Date - 2022-03-10T23:15:03+05:30 IST