Abn logo
Sep 21 2021 @ 01:30AM

పంజాబ్‌ సీఎంగా చన్ని ప్రమాణం

  • డిప్యూటీ సీఎంలుగా రంధావా, ఓపీ సోని


చండీగఢ్‌, సెప్టెంబరు 20: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌సింగ్‌ చన్ని సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధావా, ఓపీ సోని కూడా ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ సహా పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. తాజా మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ గైర్హాజరయ్యారు.


కాగా, దళిత సిక్కు వర్గానికి చెందిన చరణ్‌జీత్‌సింగ్‌ చన్ని(58) పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకెక్కారు. ఇక డిప్యూటీ సీఎంలలో సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధవా.. జాట్‌ సిక్కు వర్గానికి చెందినవారు కాగా, ఓపీ సోనీ హిందువు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి చన్ని మాట్లాడుతూ.. తానొక సామాన్యుడిని (ఆమ్‌ ఆద్మీ) అని, తనది సామాన్యుల ప్రభుత్వమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు.  పేదలకు నీటి బిల్లును రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ ఎన్నికల హామీని తక్షణమే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 


ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చరణ్‌జీత్‌సింగ్‌ చన్నికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్‌ ప్రజలకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చన్ని సర్కారుతో కలిసి పనిచేస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను పీసీసీ చీఫ్‌ సిద్ధూ, సీఎం చన్నిల ఉమ్మడి నాయకత్వంలో ఎదుర్కొంటామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. సిద్ధూ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్‌ రావత్‌ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడంతో ఈ వివరణ ఇచ్చింది. పీసీసీ చీఫ్‌తోపాటు ముఖ్యమంత్రి సారథ్యం వహించడమన్నది సహజమేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ తెలిపారు. దీనిపై విమర్శలు చేయడం ద్వారా బీజేపీ, అకాలీదళ్‌, బీఎస్పీ, ఆప్‌ పార్టీలు ఓ దళిత ముఖ్యమంత్రిని అవమానపరుస్తున్నాయని ఆరోపించారు.


ఇక పంజాబ్‌ వ్యవహారం ముగియడంతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుటుంబమంతా షిమ్లాకు వెళ్లింది. ప్రియాంకగాంధీ వాధ్రా ఇప్పటికే తన పిల్లలతో కలిసి అక్కడి సొంత కాటేజ్‌కి వెళ్లగా, సోమవారం ఉదయం సోనియా, సాయంత్రం రాహుల్‌ అక్కడికి చేరుకున్నారు. మూడు రోజులపాటు వారు అక్కడే గడపనున్నట్లు, పార్టీ నేతలకు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.మహిళను వేధించిన వ్యక్తికి సీఎం పదవా?

చన్ని రాజీనామా చేయాలి: జాతీయ మహిళా కమిషన్‌ 


న్యూఢిల్లీ: చరణ్‌జీత్‌సింగ్‌ చన్నిని కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ ముఖ్యమంత్రిని చేయడం పట్ల జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్‌ అధికారిని వేదించిన వ్యకి ముఖ్యమంత్రి కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుందని ప్రశ్నించారు 2018లో మంత్రిగా ఉన్న చరణ్‌జీత్‌సింగ్‌ చన్ని తనకు అసభ్యకర మెసేజ్‌ పంపారంటూ ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి ఆరోపించారు. దీనిని జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మహిళా కమిషన్‌ను తాను ఆదేశించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేఖాశర్మ తెలిపారు.