దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ షెడ్యూల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి 3 పరుగులు కావాల్సి ఉండగా.. పంజాబ్ ఒక్క పరుగు కూడా చేయలేదు. దీంతో విజయం రాజస్థాన్ సొంతమైంది. అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్లు ఎవిన్ లూయిస్(36: 21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), యశవ్వి జైశ్వాల్(49: 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ సంజు శాంసన్(4) మళ్లీ నిరాశపరిచాడు. మళ్లీ మిడిలార్డర్లో లియామ్ లివింగ్‌స్టోన్(25: 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లోమ్రార్(43: 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ ఏకంగా 185 పరుగులు చేసి ఆలౌటైంది.
అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది. మయాంక్ అగర్వాల్(67: 43 బంతుల్లో 7 ఫోర్టు, 2 సిక్స్‌లు) అర్థసెంచరీతో మెరవగా, కెప్టెన్ కేఎల్ రాహుల్(49: 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 119 పరుగుల వరకు వికెట్ పడకుండా ఆడిన రాహుల్-అగర్వాల్ జంట రాజస్థాన్ నుంచి మ్యాచ్‌ను దాదాపు లాగేసుకుంది.
అయితే వెంటవెంటనే వీరిద్దరూ అవుట్ కావడంతో మళ్లీ రాజస్థాన్‌కు అవకాశం లభించినట్లైంది. కానీ తరువాత వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్(26 నాటౌట్: 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్(32: 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) వికెట్ పడకుండా కాపాడుకుంటూ జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. చివర్లో చివరి ఓవర్లో 4 పరుగులు కావాల్సి ఉండగా మ్యాచ్ కచ్చితంగా పంజాబ్‌దే అనిపించింది. కానీ కార్తిక్ త్యాగి ఒకే ఒక్క పరుగు ఇచ్చి పూరన్‌తో పాటు దీపక్ హుడా(0)ను అవుట్ చేసి పంజాబ్‌కు భారీ షాకిచ్చాడు. దీంతో విజయం రాజస్థాన్ సొంతం చేసుకుంది.