కొవిడ్-19 జరిమానాలను భారీగా పెంచిన పంజాబ్

ABN , First Publish Date - 2020-05-29T23:55:42+05:30 IST

కోవిడ్-19 ఆంక్షలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ..

కొవిడ్-19 జరిమానాలను భారీగా పెంచిన పంజాబ్

చండీగఢ్: కోవిడ్-19 ఆంక్షలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగంగా ఉమ్మి వేసిన వారికి, మాస్క్ ధరించకుండా బయటికి వచ్చిన వారికి విధిస్తున్న జరిమానాను రూ. 500 వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. హోమ్ క్వారంటైన్ నిబంధన ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాను కూడా రూ.2 వేల వరకు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గతంలో మాస్కులు ధరించని వారికి రూ.200, బహిరంగంగా ఉమ్మిన వారికి రూ.100 చొప్పున ప్రభుత్వం జరిమానా విధించింది. స్వీయ నిర్బంధ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి రూ. 500 వరకు జరిమానా విధించారు.


ఇటీవల కొవిడ్-19 ఆంక్షలను ఉల్లంఘిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో జరిమానా మొత్తాన్ని పెంచాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ వెల్లడించారు. కాగా సామాజిక దూరం నిబంధనను పాటించని దుకాణదారులకు రూ.2 వేలు, బస్సు యజమానులకు రూ.3 వేలు, కారు యజమానులకు రూ.2 వేలు, ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనదారులకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. జరిమానా చెల్లించని వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని అమరీందర్ సింగ్ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు. 

Updated Date - 2020-05-29T23:55:42+05:30 IST