Abn logo
Nov 26 2021 @ 00:36AM

పంజాబ్‌ పోరు

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ గురువారం తన పార్టీ ప్రభుత్వంమీదే మరో అస్త్రాన్ని ప్రయోగించాడు. పంజాబ్ ను సర్వనాశనం చేస్తున్న మాదకద్రవ్యాల సమస్యమీద ప్రత్యేక దర్యాప్తు బృందం తయారుచేసిన నివేదికను బహిర్గతం చేయాలనీ లేనిపక్షంలో తాను ఆమరణ నిరాహారదీక్షకు కూచుంటానని హెచ్చరించాడు. పవిత్ర గురుగ్రంథాన్ని అవమానించిన ఘటనల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో ప్రజలకు తెలియచేయకపోతే ఊరుకొనేది లేదని కూడా హెచ్చరించాడు. నిజానికి ఈ హెచ్చరికలు కొత్తవేమీ కాదు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను వీటితోనే ఇరకాటంలోకి నెట్టి,  చివరకు పార్టీ విడిచిపోయేట్టు చేశాడు సిద్దూ. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో కూడా, ఎన్నికలు మరింత దగ్గరపడుతున్న తరుణంలో అదేరీతిన వ్యవహరిస్తుండటం అనేకులకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. 


ఆరేళ్ళక్రితం ఆయా ప్రార్థనాస్థలాల్లో గురుగ్రంథ్ సాహెబ్ కు అవమానం జరిగిన వరుస ఘటనలూ, అనంతరం రేగిన నిరసనలూ ఘర్షణలూ కాల్పులూ పంజాబ్ ను కుదిపేసినమాట నిజం.  2017 ఎన్నికల్లో బీజేపీ అకాలీ దళ్ ప్రభుత్వం వీటి కారణంగా ఘోరంగా ఓడిపోయింది. నిజాలు నిగ్గుతేల్చుతామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం ఏమీ చేయకపోతే ఎలా అని సిద్దూ ప్రశ్నిస్తున్నారు. చన్నీ నియమించిన అడ్వకేట్ జనరల్ ను తప్పించేవరకూ సిద్దూ భీష్మించుకుకూర్చున్నది కూడా ఈ అంశాన్ని చూపించే. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాలుగున్నరేళ్ళుగా తాము అంగుళం కూడా కదపని అంశాలను లేవనెత్తి, మాజీ ముఖ్యమంత్రిమీద నాలుగు రాళ్ళు వేసినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్ ని నమ్ముతారా అన్నది ప్రశ్న. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రజల పక్షాన నిలిచినట్టుగా కనిపించడం కాంగ్రెస్ కు అవసరమేకానీ, సిద్దూ ధోరణి పార్టీలో అంతర్గత పోరు కొనసాగింపుగానే కనిపిస్తుంది. అమరీందర్ ను పార్టీనుంచి పంపేసిన తరువాత, ఆ స్థానాన్ని చన్నీతో భర్తీచేసిన కొద్దిరోజుల్లోనే సిద్దూ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. పైకి ఏ కారణాలు చెబుతున్నా చన్నీని సిద్దూ సహించలేకపోతున్నారన్నదే అధికంగా ప్రచారమైంది. సిద్దూ దారిలోనే చన్నీ ఇప్పటివరకూ ప్రయాణిస్తున్నా, ఈ కొత్త డిమాండ్ల విషయంలో నిర్ణయాలు చేయడం అంత సులభమేమీ కాదు. కొత్త వ్యవసాయచట్టాల ఉపసంహరణ నిర్ణయం పంజాబ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినదేనని అత్యధికుల విశ్వాసం. ఈ నిర్ణయం తీసుకున్న మూడురోజుల్లోనే కేజ్రీవాల్ పంజాబ్లో అడుగుపెట్టి బోలెడన్ని వరాలు ప్రకటించారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి తాము అధికారంలోకి రాగానే ప్రతీ మహిళకూ వెయ్యిరూపాయలు ఇస్తానన్నారు. కొన్ని యూనిట్లవరకూ కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇంకా చురుకుగా బరిలోకి దిగనట్టుగా కనిపిస్తున్నప్పటికీ, మొన్నటివరకూ కయ్యం నెరపిన బీజేపీతో వియ్యమందడం ఎలాగూ ఖాయమే. అమరీందర్ తో పొత్తుకోసమే మోదీ మూడు చట్టాలనూ వెనక్కుతీసుకున్నారని ఎక్కువమందే నమ్ముతున్నారు. శిరోమణీ అకాలీదళ్ తో కూడా ఆయనకు మంచి సయోధ్యే ఉంది. మూడు పార్టీల కూటమితో అమరీందర్ గణనీయంగా చీల్చేవి ఎలాగూ కాంగ్రెస్ ఓట్లే. 77 స్థానాలతో ఐదేళ్ళక్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇటీవలి ఎన్నికల సర్వేల్లో కూడా ముందజంలోనే ఉంది. ఆమ్ ఆద్మీపార్టీ కంటే ఓ మెట్టుపైనే నిలబడింది. కానీ, కొత్త వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, ఆప్ వరాల జల్లుల ప్రభావం కాదనలేనివి. కర్తార్ పూర్ కారిడార్ పోయి మర్యాదలు అందుకోవడం, నాలుగు మంచిమాటలు చెప్పడంతో పాటు, ఇమ్రాన్ ఖాన్ ను పెద్దన్నగా గౌరవిస్తూ సిద్దూ చేసిన వ్యాఖ్య బీజేపీకి రాజకీయ ఆయుధంగా ఎంతో ఉపకరిస్తున్నది. దళిత ముఖ్యమంత్రిగా చన్నీ రాకతో కాంగ్రెస్ కు కలిగిన రాజకీయప్రయోజనాన్ని నిలబెట్టుకోవడం సిద్దూ చేతుల్లోనే ఉంది. లేనిపక్షంలో త్రిశంకు సభ ఏర్పడి, అంతిమంగా అధికారం కాంగ్రెస్ చేతుల్లోనుంచి పోయే ప్రమాదం ఉన్నది.

ప్రత్యేకం మరిన్ని...