రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా పీఎన్‌బీ

ABN , First Publish Date - 2020-04-01T18:26:58+05:30 IST

భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంలో భాగంగా ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లోకి..

రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా పీఎన్‌బీ

 హైదరాబాద్: భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనంలో భాగంగా ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లోకి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు విలీనం అయ్యాయి. దీంతో ఎస్‌బీఐ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ అవతరించింది. దేశవ్యాప్తంగా ఉన్న యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్రాంచిలన్నీ నేటి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచిలుగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. కాగా డిపాజిటర్లతో సహా వినియోగదారులంతా ఇకపై పీఎన్‌బీ కస్టమర్లుగానే చెలామణీ కానున్నారు. ఉమ్మడి పీఎన్‌బీకి మొత్తం 11 వేలకు పైగా బ్రాంచిలు, 13 వేలకు పైగా ఏటీఎంలు, లక్షమంది ఉద్యోగులు ఉండగా.. రూ.18 లక్షల కోట్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు పేర్కొంది. 


పంజాబ్ నేషనల్ బ్యాంకు... భారత తొలి ‘స్వదేశీ బ్యాంకు’గా 1895 ఏప్రిల్ 12న కార్యకాలాపాలు ప్రారంభించింది. జాతీయ స్ఫూర్తితో పూర్తిగా భారతీయుల చేత, భారతీయ మూలధనంతో ప్రారంభమైన తొలి బ్యాంకుగా గుర్తింపు పొందింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న పీఎప్‌బీలో... 1951 మొదలు ఇప్పటి వరకు 7 బ్యాంకులు విలీనం అయ్యాయి. 

Updated Date - 2020-04-01T18:26:58+05:30 IST