పంజాబే కింగ్స్‌

ABN , First Publish Date - 2022-04-04T09:52:48+05:30 IST

ఈ ఐపీఎల్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు దురదృష్టం వెంటాడింది.

పంజాబే  కింగ్స్‌

లివింగ్‌స్టోన్‌ ఆల్‌రౌండ్‌షో 

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు హ్యాట్రిక్‌ ఓటమి

 ఐపీఎల్‌లో చెన్నై ఆలౌటవడం 2018 తర్వాత ఇది రెండోసారి

ముంబై: ఈ ఐపీఎల్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు దురదృష్టం వెంటాడింది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్ల ఘోర వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. అటు పంజాబ్‌ కింగ్స్‌కు లివింగ్‌స్టోన్‌ (32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60; 2/25) బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ అండగా నిలిచాడు. దీంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 54 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లో మయాంక్‌ సేనకిది రెండో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. ధవన్‌ (33), జితేశ్‌ శర్మ (26) ఫర్వాలేదనిపించారు. జోర్డాన్‌, ప్రిటోరియస్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 18 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. శివమ్‌ దూబే (30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) అర్ధసెంచరీ వృథా అయ్యింది. రాహుల్‌ చాహర్‌కు మూడు, వైభవ్‌ అరోరాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా లివింగ్‌స్టోన్‌ నిలిచాడు. 


వణికించారు:

ఛేదన లో చెన్నైని పంజాబ్‌ బౌలర్లు చెడుగుడు ఆడారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో శివమ్‌ దూబే ఒక్కడే పోరాడాడు. ఇక వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తానెదుర్కొన్న నాలుగో బంతికే రుతురాజ్‌ (1) వెనుదిరిగాడు. మూడో ఓవర్‌లో ఊతప్ప (13)ను అరోరా అవుట్‌ చేయగా, ఆ వెంటనే మొయిన్‌ అలీ (0), జడేజా (0) డకౌట్‌గా వెనుదిరిగారు. ఫలితంగా పవర్‌ప్లేలో సీఎ్‌సకే 27/4 స్కోరుతో దయనీయ స్థితిలో నిలిచింది. అరంగేట్ర పేసర్‌ వైభవ్‌ ఆరోరా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక నిదానంగా ఆడిన రాయుడు (13) ఎనిమిదో ఓవర్‌లో అవుట్‌ కావడంతో చెన్నై సగం జట్టు పెవిలియన్‌లో కూర్చున్నట్టయింది. అప్పటికింకా కొండంత లక్ష్యం ఉండడంతో ఓటమి కళ్లముందు కనిపించింది. అయితే శివమ్‌ దూబే, ధోనీ (23) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఆరో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం అందించారు. దూబే ధాటిగా ఆడుతుండడంతో ధోనీ అతడికే స్ట్రయికింగ్‌ వచ్చేలా చూశాడు. 14వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన దూబే 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. కానీ నిలకడగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 15వ ఓవర్‌లో మరో ఝలక్‌ తగిలింది. వరుస బంతుల్లో దూబే, బ్రావో (0)ను లివింగ్‌స్టోన్‌ అవుట్‌ చేయడంతో చెన్నై ఆశలు పూర్తిగా అడుగంటాయి. అప్పటికి 30 బంతుల్లో 83 రన్స్‌ కావాల్సి ఉండగా క్రీజులో ధోనీ ఉన్నా బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు. 18వ ఓవర్‌లో ధోనీ, జోర్డాన్‌ (5) అవుటవడంతో చెన్నై చిత్తుగా ఓడింది.


లివింగ్‌స్టోన్‌ బాదుడు:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(4)ను.. రెండో ఓవర్‌లో ధోనీ సూపర్‌ త్రోతో రాజపక్స (9)ను కోల్పోయింది. కానీ పది ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు 109 పరుగులు సాధించింది. దీనికి కారణం.. లివింగ్‌స్టోన్‌ బాదుడు. డెత్‌ ఓవర్లలో చెన్నై పేసర్లు పుంజుకుని ఆరు ఓవర్లలో 38 పరుగులే ఇచ్చారు. రెండో ఓవర్‌లోనే క్రీజులోకి అడుగుపెట్టిన లివింగ్‌స్టోన్‌ అలవోకగా సిక్సర్లు బాదుతూ స్కోరును రాకెట్‌ వేగంతో తీసుకెళ్లాడు. మూడో ఓవర్‌లో 6,4తో పాటు ఐదో ఓవర్‌లో 6,4,4,4,6తో 26 పరుగులు రాబట్టాడు. ఆరో ఓవర్‌లో ధవన్‌ చెలరేగి 6,4,4 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 72కి చేరింది. వీరి జోరును చూస్తే 200 స్కోరు అవలీలగా సాధిస్తుందనిపించింది. దీనికి తోడు లివింగ్‌స్టోన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రాయుడు వదిలేశాడు. ఇదే జోరుతో అతను మరో భారీ సిక్సర్‌తో 27 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు. కానీ పదో ఓవర్‌లో చెన్నైకి బ్రేక్‌ లభించింది. బ్రావో వేసిన ఈ ఓవర్‌లో ధవన్‌ క్యాచ్‌ను జడ్డూ అందుకోవడంతో మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌లోనే లివింగ్‌స్టోన్‌ను జడ్డూ అవుట్‌ చేశాడు. ఈ దశలో తొలి మ్యాచ్‌ ఆడిన జితేశ్‌ శర్మ ఉన్న కాసేపు 3 సిక్సర్లతో హల్‌చల్‌ చేశాడు. అయితే స్కూప్‌ షాట్‌ ఆడే  ప్రయత్నంలో క్యాచ్‌ అవుటయ్యాడు. బ్రావో, ప్రిటోరియస్‌, జోర్డాన్‌ త్రయం డెత్‌ ఓవర్లలో చెలరేగింది. దీంతో టెయిలెండర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లడంతో పంజాబ్‌ భారీస్కోరు చేయలేకపోయింది.


స్కోరుబోర్డు

పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్‌ (సి) ఊతప్ప (బి) ముకేశ్‌ 4; ధవన్‌ (సి) జడేజా (బి) బ్రావో 33; రాజపక్స (రనౌట్‌) 9; లివింగ్‌స్టోన్‌ (సి) రాయుడు (బి) జడేజా 60; జితేశ్‌ (సి) ఊతప్ప (బి) ప్రిటోరియస్‌ 26; షారుక్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) జోర్డాన్‌ 6; స్మిత్‌ (సి) బ్రావో (బి) జోర్డాన్‌ 3; రబాడ (నాటౌట్‌) 12; రాహుల్‌ చాహర్‌ (సి) బ్రావో (బి) ప్రిటోరియస్‌ 12; వైభవ్‌ అరోరా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 180/8. వికెట్ల పతనం: 1-4, 2-14, 3-109, 4-115, 5-146, 6-151, 7-161, 8-176. బౌలింగ్‌: ముకేశ్‌ 4-0-52-1; జోర్డాన్‌ 4-0-23-2; బ్రావో 3-0-32-1; జడేజా 4-0-34-1; ప్రిటోరియస్‌ 4-0-30-2; మొయిన్‌ అలీ 1-0-8-0.


చెన్నై సూపర్‌ కింగ్స్‌:

రాబిన్‌ ఊతప్ప (సి) అగర్వాల్‌ (బి) అరోరా 13; రుతురాజ్‌ (సి) ధవన్‌ (బి) రబాడ 1; మొయిన్‌ అలీ (బి) అరోరా 0; అంబటి రాయుడు (సి) శర్మ (బి) స్మిత్‌ 13; రవీంద్ర జడేజా (బి) అర్ష్‌దీప్‌ 0; శివమ్‌ దూబే (సి) అర్ష్‌దీప్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 57; ధోనీ (సి) శర్మ (బి) చాహర్‌ 23; బ్రావో (సి అండ్‌ బి) లివింగ్‌స్టోన్‌ 0; ప్రిటోరియస్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) చాహర్‌ 8; జోర్డాన్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) చాహర్‌ 5; ముఖేష్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం 18 ఓవర్లలో 126 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-10, 2-14, 3-22, 4-23, 5-36, 6-98, 7-98, 8-107, 9-121, 10-126. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-21-2, రబాడ 3-0-28-1, అర్ష్‌దీప్‌ 2-0-13-1, స్మిత్‌ 2-0-14-1, రాహుల్‌ చాహర్‌ 4-0-25-3, లివింగ్‌స్టోన్‌ 3-0-25-2.


Updated Date - 2022-04-04T09:52:48+05:30 IST