హ్యాట్రిక్ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం

ABN , First Publish Date - 2020-10-21T04:42:48+05:30 IST

ఐపీఎల్-13లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కింగ్స్

హ్యాట్రిక్ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం

దుబాయి: ఐపీఎల్-13లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ ఇచ్చిన 165 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ చేధించింది. ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పంజాబ్ ఓపెనర్లు విఫలమైనప్పటికి క్రిస్ గేల్ 13 బంతుల్లో 29 పరుగులు చేశాడు. నికోలాస్ పూరన్ 28 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా మారాడు. మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపాడు. చివర్లో దీపక్ హుడా(15), జేమ్స్ నీషమ్(10) పరుగులు చేసి పంజాబ్‌ను విజయ తీరాలకు చేర్చారు. ఢిల్లీ బౌలర్లలో రబడాకు రెండు వికెట్లు, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టుకు ఓపెనర్ పృథ్వీ షా 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ కావడంతో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నీషమ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన పృథ్వీ షా మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన పంత్ ఇవాళ మ్యాచ్‌లో ఆడినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు.


ఓపెనర్ పృథ్వీ షా రాణించకపోయినప్పటికీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం మరోసారి సత్తా చాటాడు. గత మ్యాచ్‌లో చెన్నై జట్టుపై 101 పరుగులతో రాణించి సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచిన ధావన్ ఇవాల్టి మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించాడు. 61 బంతుల్లో 3 సిక్స్‌లు, 12 ఫోర్లతో సత్తా చాటి 106 పరుగులతో సెంచరీ పూర్తి చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్ రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్‌లో 5వేల పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులోకెక్కాడు. ధావన్ వన్‌మ్యాన్ షోతో ఢిల్లీ జట్టులో కీలక బ్యాట్స్‌మెన్స్ విఫలమైనప్పటికీ ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో షమీకి రెండు వికెట్లు, మ్యాక్స్‌వెల్, నీషమ్, మురుగన్ అశ్విన్‌లకు తలో వికెట్ దక్కింది. ఢిల్లీ లక్ష్యాన్నీ పంజాబ్ 19 ఓవర్లలోనే చేధించడంతో ధావన్ సెంచరీ వృధా అయిపోయింది.

Updated Date - 2020-10-21T04:42:48+05:30 IST