పంజాబ్‌కు నిజాయితీగల సీఎం దొరికాడు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-03-13T22:24:03+05:30 IST

పంజాబ్‌కు చాలా కాలం తర్వాత నిజాయితీ గల ముఖ్యమంత్రి దొరికాడని భగవంత్ మాన్‌ను ఉద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న అనంతరం..

పంజాబ్‌కు నిజాయితీగల సీఎం దొరికాడు: కేజ్రీవాల్

చండీగఢ్: పంజాబ్‌కు చాలా కాలం తర్వాత నిజాయితీ గల ముఖ్యమంత్రి దొరికాడని భగవంత్ మాన్‌ను ఉద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న అనంతరం.. మొదటిసారి పంజాబ్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ షోకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఇప్పుడు ఖర్చు చేయబోయే ప్రతి పైసా ప్రజలకే చేరుతుంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాం. చాలా కాలం తర్వాత పంజాబ్‌కు నిజాయితీ గల ముఖ్యమంత్రి దొరికాడు. సంతోషమైన పంజాబ్‌ను మీరు తొందర్లోనే చూస్తారు’’ అని అన్నారు.


ఇక పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రజల కోసం పని చేయాలి. అందుకే మేము మా భద్రతను 122 మందిని తగ్గించాం. 403 మంది పోలీసులను, 27 పోలీసు వాహనాలను వాళ్ల పోలీస్ స్టేషన్లకు పంపించాం. అలాగే ఏ ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో ఉండదు. కేవలం షహీద్ భగత్‌సింగ్, బాబాసాహేబ్ అంబేద్కర్ ఫొటోలు మాత్రమే ఉంటాయి’’ అని అన్నారు. కేజ్రీవాల్ సైతం ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే వ్యవహరించారు. తన సొంత కారులో ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా చాలా రోజులు అతి తక్కువ భద్రతతో ప్రయాణాలు చేశారు.

Updated Date - 2022-03-13T22:24:03+05:30 IST