Abn logo
Apr 10 2020 @ 17:23PM

మే 1వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన మరో రాష్ట్రం

పంజాబ్‌లో మే1 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు

చంఢీగర్: పంజాబ్‌లో మే 1వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తదుపరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించిన రెండో రాష్ట్రం పంజాబ్ కావడం గమనార్హం. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే మే 1వరకూ లాక్‌డౌన్ అమలు చేయక తప్పదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయాన్ని కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.


కర్ణాటక ప్రభుత్వం కూడా వైద్యులు, నిపుణులు సూచించిన దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత ప్రతిపాదనను మంత్రివర్గ సమావేశం సాక్షిగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా శనివారం కేబినెట్‌ సమావేశం నిర్వహించి.. చర్చించిన అనంతరం లాక్‌డౌన్ పొడిగించాలన్న నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ను పొడిగించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోదీకి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పొడిగింపుపై ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోదీ.. అనంతరం తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement