కేజ్రీవాల్‌పై ఫేక్ వీడియో..బీజేపీ నేత ఇంటికి పోలీసులు

ABN , First Publish Date - 2022-04-09T21:03:41+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను తారుమారు చేసి నకిలీ వీడియోను ట్వీట్ చేసిన ..

కేజ్రీవాల్‌పై ఫేక్ వీడియో..బీజేపీ నేత ఇంటికి పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను తారుమారు చేసి నకిలీ వీడియోను ట్వీట్ చేసిన ఆరోపణలపై ఢిలీ బీజేపీ ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ ఇంటికి పంజాబ్ పోలీసులు శనివారంనాడు వెళ్లారు. తనను అరెస్టు చేసేందుకే 'ఆప్' అధికారంలో ఉన్న పంజాబ్‌కు చెందిన పోలీసులు తన ఇంటికి వచ్చినట్టు జిందాల్ ట్వీట్ చేశారు. ఆయనకు (కేజ్రీవాల్) తాను భయపడేది లేదని, నిజం ప్రజలకు తెలియజేస్తూనే ఉంటానని ఆయన చెప్పారు.


కేజ్రీవాల్ వీడియో పేరుతో మార్పులు చేర్పులు చేసిన ఒక నకిలీ వీడియోను ట్విట్టర్ ఖాతాలో జిందాల్ షేర్ చేసినట్టు ఆయనపై పంజాబ్ పోలీసులు మొహాలిలో శుక్రవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్-హర్యానా న్యాయవాది, ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కాగా, పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం ఇది రెండోసారి. అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఒరిజనల్ ఫుటేజ్‌ క్రాప్ చేసి ఫేక్ వీడియోను జిందాల్ షేర్ చేశారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈనెల 6న ఈ ట్వీట్ పోస్ట్ అయింది. స్వచ్ఛమైన, జవాబుదారీతనం కలిగిన ప్రభుత్వాన్ని అందిస్తామని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించే విధంగా వీడియోను క్రాప్ చేసి, ఫేక్ వీడియో తయారు చేసినట్టు ఫిర్యాదుదారులు ఆరోపించారు.

Updated Date - 2022-04-09T21:03:41+05:30 IST