Abn logo
Sep 19 2021 @ 02:45AM

పంజాబ్‌ సీఎం రాజీనామా

  • కాంగ్రెస్‌ అధిష్ఠానం తీరుతో అసంతృప్తి..
  • సీఎల్పీ భేటీకి ముందే వైదొలగిన అమరీందర్‌సింగ్‌
  • అవమానాలు భరించలేకేనని వ్యాఖ్య..
  • తదుపరి సీఎంగా సునీల్‌ జాఖడ్‌ పేరు ప్రచారం
  • సిద్ధూకు పాక్‌తో సంబంధాలు..
  • ఆయన్ను సీఎంను చేస్తే దేశ భద్రతకు ప్రమాదం: అమరీందర్‌


ఎమ్మెల్యేలను ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీకి పిలిపించుకున్నారు. తాజాగా సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని నడపలేననే అనుమానం వారికి ఉండాలి. లేదా మరేదైనా కారణం ఉండి ఉండాలి. కానీ, జరుగుతున్న పరిణామాలు నన్ను అవమానించేలా ఉన్నాయి.

- అమరీందర్‌ సింగ్‌


చండీగఢ్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: పంజాబ్‌ కాంగ్రె్‌సలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్‌ అసెంబ్లీకి మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవి నుంచి అమరీందర్‌ వైదొలగడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్‌సింగ్‌ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం జరగనుండగా.. అంతకుముందే ఆయన రాజీనామా చేశారు. ఉదయమే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడానని, రాజీనామా గురించి ఆమెతో చెప్పానని అన్నారు. ‘‘ఎమ్మెల్యేలను ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీకి పిలిపించుకున్నారు. తాజాగా సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని నడపలేననే అనుమానం అధిష్ఠానానికి ఉండాలి. లేదా మరేదైనా కారణం ఉండి ఉండాలి’’ అని అమరీందర్‌ అన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా, పంజాబ్‌ కాంగ్రె్‌సలో గత కొన్నాళ్లుగా వర్గ పోరు కొనసాగుతోంది. నవజోత్‌సింగ్‌ సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుకునేందుకు సీఎం అమరీందర్‌సింగ్‌ తుది దాకా ప్రయత్నించారు. కానీ, అధిష్ఠానం ఆయన మాట వినకుండా సిద్ధూకే పార్టీ పగ్గాలు అప్పగించింది.


తాజాగా శనివారం సుమారు 50 మంది ఎమ్మెల్యేలు అమరీందర్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తూ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. దీంతో అధిష్ఠానం ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ బాధ్యతలను రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి హరీశ్‌ రావత్‌కు అప్పగించింది.


అమరీందర్‌ సేవలను కొనియాడిన సీఎల్పీ

సీఎల్పీ భేటీ విషయాన్ని సాధారణంగా శాసనసభాపక్ష నేత ముఖ్యమంత్రి ప్రకటించాల్సి ఉండగా, అమరీందర్‌కు బదులుగా హరీశ్‌ రావత్‌ ప్రకటించారు. ఆ వెంటనే అమరీందర్‌ తన వర్గం ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమై చర్చించారు. సీఎల్పీ సమావేశానికి ముందే రాజీనామా చేశారు. కాగా, ముఖ్యమంత్రిగా అమరీందర్‌ సేవలను సీఎల్పీ భేటీ కొనియాడింది. కాబోయే సీఎంగా సీఎల్పీ నూతన నేత ఎంపిక బాధ్యతను సోనియాగాంధీకి అప్పగిస్తూ తీర్మానించింది. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రధానంగా దివంగత నేత బలరాం జాఖడ్‌ కుమారుడు, పార్టీ సీనియర్‌ నేత సునీల్‌ జాఖడ్‌ పేరు వినిపిస్తోంది. 


కాంగ్రెస్‌కు బెడిసికొట్టిన బీజేపీ విధానం? 

ముఖ్యమంత్రి మార్పు విషయంలో బీజేపీ బాటలో వెళ్లాలనే ఆలోచన కాంగ్రెస్‌కు బెడిసికొట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లో, ఇంతకుముందు కర్ణాటకలో ముఖ్యమంత్రులను బీజేపీ మార్చి.. కొత్త వారికి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు రాష్ట్రాల్లోనూ అధిష్ఠానం నిర్ణయంపై బీజేపీ నేతల్లో ఎటువంటి అసమ్మతి వ్యక్తం కాలేదు. కొత్త ముఖ్యమంత్రుల నాయకత్వంలో పార్టీ ఐక్యంగా పనిచేస్తోంది. కానీ, పంజాబ్‌లో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్‌ ఆలోచన చేస్తుండగానే.. సీఎం అమరీందర్‌సింగ్‌ స్వయంగా రాజీనామా చేశారు. అవమానాలు భరించలేకే వైదొలగుతున్నట్లు ప్రకటించారు. పైగా పీసీసీ అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ‘గీత’ను అమరీందర్‌ దాటినట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఆయన బీజేపీలో చేరవచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

సిద్ధూకు పాక్‌తో సంబంధాలు అమరీందర్‌సింగ్‌ ఆరోపణ

పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూపై రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధూకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ ఆయనకు సన్నిహితులని ఆరోపించారు. ఆయనను సీఎంని చేస్తే దేశ భద్రతకు ప్రమాదమన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నూతన ముఖ్యమంత్రిగా సిద్ధూ పేరు ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకిస్తానన్నారు. ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లవద్దని సిద్ధూకు తాను ఆనాడే చెప్పానన్నారు. ఓవైపు సరిహద్దుల్లో సైనికులు పాక్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతుంటే.. సిద్ధూ వెళ్లి ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకున్నారని మండిపడ్డారు.