చన్నీ సోదరుడికి టిక్కెట్ నిరాకరణ.. ఇండిపెండెంట్‌గా బరిలోకి

ABN , First Publish Date - 2022-01-16T21:16:13+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా‌ ఆ పార్టీ రాష్ట్ర..

చన్నీ సోదరుడికి టిక్కెట్ నిరాకరణ.. ఇండిపెండెంట్‌గా బరిలోకి

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా‌ ఆ పార్టీ రాష్ట్ర యూనిట్‌లో అసంతృప్తులకు తావిచ్చింది. ముఖ్యంగా మాన్సా, మొగా, మలౌట్, బస్సి పఠానా నియోజవర్గాల టిక్కెట్లు ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్‌కు సైతం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లభించలేదు. ఖరార్ సివిల్ ఆసుపత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న మనోహర్ సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, బస్సీ పఠానా నియోజకవర్గం టెక్కెట్ ఆశించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ఆయన ప్రకటించారు.


మలౌట్, మొగ నియోజవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వలేదు. మలౌట్ నియోజవర్గానికి పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అజయిబ్ సింగ్ భట్టి, మొగా నియోజకవర్గానికి హర్జోత్ కమల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దికాలం క్రితమే కాంగ్రెస్‌లో చేరిన వివాదాస్పద పంజాబీ గాయకుడు సిద్ధు ముస్సేవాలాకు మాన్సా నియోజకవర్గం టిక్కెట్ లభించింది. హర్జోత్ కమల స్థానంలో సోనూసూద్ సోదరి మాలవిక సూద్‌కు మొగ టిక్కెట్ కేటాయించారు. ఆప్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రూపిందర్ కౌర్ రూబీకి మలౌట్-ఎస్‌సీ సీటు కేటాయించారు. గత ఎన్నికల్లో బటిండా రూరల్ నుంచి ఆప్ టిక్కెట్‌పై ఆమె గెలుపొందారు.


కాగా, 117 మంది అసెంబ్లీ స్థానాలకు గాను 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు ప్రకటించింది. తక్కిన 31 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పాటియాలా అర్బన్ నియోజకవర్గం కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఒకే విడతలో పంజాబ్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Updated Date - 2022-01-16T21:16:13+05:30 IST