Abn logo
Aug 15 2021 @ 14:48PM

పాక్‌కు పంజాబ్ సీఎం ఘాటు హెచ్చరిక

చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాకిస్థాన్‌కు ఘాటైన సందేశాన్ని పంపించారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత దేశ గడ్డపై దాడి చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. భారత దేశంపై దాడి చేసినా, భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినా సహించేది లేదన్నారు. భారత దేశం విషయంలో ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే పాకిస్థాన్‌కు జీవిత కాలం గుర్తుండిపోయేవిధంగా గుణపాఠం చెబుతామన్నారు. 


‘‘మా భూభాగంపై దాడి లేదా దురాక్రమణను సహించబోం. దుస్సాహసానికి వాళ్ళు (పాకిస్థాన్) పాల్పడితే, వారి జీవితకాలం గుర్తుండిపోయేలా గుణపాఠం చెబుతాం’’ అని కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రైతుల ఉద్యమంలో చొరబడేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని చెప్పారు. రైతు ఉద్యమం పంజాబ్‌కు, దేశానికి భద్రతాపరమైన ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ మద్దతుగల భారత వ్యతిరేక శక్తులు రైతు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 


స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఎర్ర కోట నుంచి మాట్లాడుతూ, పాకిస్థాన్, చైనాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం, విస్తరణవాదం భారత దేశానికి సవాలుగా మారాయని చెప్పారు. దేశ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి భయపడేది లేదన్నారు. 2016లో ఉరిలో సర్జికల్ స్ట్రైక్స్ చేశామని, 2019లో బాలాకోట్‌లో వైమానిక దాడులు చేశామని, తద్వారా మన సైన్యం శక్తి, సామర్థ్యాలు వెల్లడయ్యాయని చెప్పారు. సైనిక దళాలను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పారు.