ఛండీగఢ్: అవినీతి ఆరోపణలపై తన మంత్రవర్గ సహచరునిపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) వేటు వేశారు. ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా (Vijay Singla)ను మంత్రి పదవి నుంచి తొలగించారు. మంత్రి అవినీతికి పాల్పడినట్టు బలమైన ఆధారాలు కనుగొనడంతో సీఎం ఈ చర్య తీసుకున్నారు. వివిధ కాంట్రాక్టులపై అధికారుల నుంచి 1 శాతం కమిషన్ను వసూలు చేసేవారని మంత్రిపై ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
సింగ్లాపై వచ్చిన ఫిర్యాదులతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు మాన్ చెప్పారు. ఒక్క శాతం అవినీతిని కూడా తాము సహించేది లేదని అన్నారు. ప్రజలు ఎన్నో అంచనాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారని, ఆ అంచనాలను నిలబెట్టుకోవడం తమ బాధ్యతని ఆయన వివరించారు. 2015లోనూ అవినీతి ఆరోపణలు వచ్చిన ఒక మంత్రిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ పదవి నుంచి తొలగించారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేజ్రీవాల్ తమ వద్ద వాగ్దానం తీసుకున్నారని, తామంతా ఆయన సైనికులమని మీడియాతో మాన్ చెప్పారు.